
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు వాసాలమర్రి సర్పంచ్ పోగుల అంజయ్య ఫోన్ చేసి మాట్లాడారు. ఈనెల 22న దత్తత గ్రామంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా ఊరంతా సామూహిక భోజనం చేద్దామని, అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. ఈ క్రమంలో సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని అంజయ్యకు సూచించారు. ఇక ఈ పర్యటన సందర్భంగా తుర్కపల్లి (మం), వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఆరోజే(ఈనెల 22)న ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలిస్తున్నారు. కాగా, గతేడాది జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ పర్యటన ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా వాసాలమర్రిలో ఆగి, స్థానికులతో మాట్లాడిన విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధిపై చర్చించిన ఆయన.. ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా వాసాలమర్రిని సందర్శించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా... నూతన కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యలాయాలు ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్ సిద్ధిపేటకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 20న ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.