సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న యాదాద్రి ఆలయం
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే యాదాద్రి ఆలయ పునఃప్రారంభ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మహా కార్యంలో ఎక్కడా చిన్న లోపం లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 21 నుంచి 28 వరకు మహా సుదర్శనయాగంతో ప్రారంభమై 28న అర్ధ రాత్రి ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం యాదాద్రిలో విస్తృతంగా పర్యటించారు. ఆలయానికి మధ్యాహ్నం 1:38 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం... రాత్రి 7:56 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. సుమారు 6 గంటలపాటు యాదాద్రిలో గడిపారు. ఇందులో 4 గంటలపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగతా సమయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.
సీఎం కేసీఆర్‌కు వేద ఆశీర్వచనం అందిస్తున్న ఆలయ అర్చకులు
తొలుత ప్రత్యేక పూజలు...
ముందుగా సీఎం కేసీఆర్ బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం ఇచ్చారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ఆలయ పరిసరాలను సీఎం పరిశీలించారు. కల్యాణకట్ట, పుష్కరిణి పనులను పరిశీలించి మంత్రులకు, అధికారులకు పలుసూచనలు చేశారు. ఆపై ప్రత్యేక బస్సులో సీఎం ఆలయ నగరి పరిసరాలను రింగ్‌రోడ్డు మీదుగా కలియతిరుగుతూ పూర్తి కావస్తున్న, పూర్తయిన పనులను పరిశీలించారు.
అలాగే కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి అధికారులకు పలుసూచనలు చేశారు. మార్చి 21 నుంచి 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న మహా సుదర్శన యాగం ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. యాగశాల నిర్మాణాలకు సంబంధించిన నమూనాను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి సీఎంకు వివరించారు. 108 యాగశాలల్లో ప్రధాన యాగశాలను తాటిఆకులతో, మిగతావి రేకులతో ఏర్పాటు చేయాలని సూచించారు.
నెలాఖరులోగా పూర్తి చేయాలి..
ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాభ్ది ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమం జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుమారు 4 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఆయన... ఉద్ఘాటనకు సంబంధించిన పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి కావాలని నిర్దేశించారు.
మార్చి 21 నుంచి 28 వరకు ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃసంప్రోక్షణ జరగాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సౌకర్యాలలో ఎక్కడా లోపం ఉండకూడదన్నారు. అనంతరం భక్తులకు వసతుల కోసం బడ్జెట్ కేటాయించారు. మంగళవారం నుంచే ఆయా శాఖలు తమకు కేటాయించిన పనులను వెంటనే ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
మరో 50 కిలోల బంగారం అవసరం...
ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం 120 కిలోల బంగారం అవసరమవగా ఇందులో 30 కిలోల బంగారానికి సరిపడా నగదు ఇప్పటికే సమకూరిందని, మరో 40 కిలోల బంగారం వివిధ వర్గాల నుంచి అందిందని వివరించారు. మరో 50 కిలోల బంగారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చివరిదశలో ఉన్నాయని వివరించారు. చెన్నై స్మార్ట్ క్రియేషన్ సంస్థ పనులపై చర్చించారు.
12న ప్రెసిడెన్షియల్ సూట్‌ల ప్రారంభం...
యాదాద్రిలో వీఐపీల కోసం నిర్మించిన 15 ప్రెసిడెన్షియల్ సూట్‌లను ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ఉద్ఘాటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చే వీఐపీల వసతి కోసం 15 సూట్‌లను ప్రారంభించనున్నారు. యాదాద్రి కలెక్టరేట్, టీఆర్‌ఎస్ నూతన భవనాల ప్రారంభం కోసం ఈ నెల 12న వస్తున్న సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్లను ప్రారంభించనున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి చెప్పారు.
సీఎం వెంట మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment