యాదాద్రి: 2022 మార్చి 28 నుంచి దివ్యదర్శనం | CM KCR Yadadri Tour He Says Temple To Be Reopened 28th March 2022 | Sakshi
Sakshi News home page

యాదాద్రి: 2022 మార్చి 28 నుంచి దివ్యదర్శనం

Published Wed, Oct 20 2021 2:09 AM | Last Updated on Wed, Oct 20 2021 11:49 AM

CM KCR Yadadri Tour He Says Temple To Be Reopened 28th March 2022 - Sakshi

మహా ఉత్కృష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శించుకున్నా. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక  పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశాం.  తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుంది. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించాం.  –కేసీఆర్‌

సాక్షి, యాదాద్రి: మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు. అంతకంటే ముందు మార్చి 21వ తేదీన మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందని చెప్పారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభ కార్యక్రమం మొత్తం  త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.


మంగళవారం రాత్రి యాదాద్రి కొండపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ పునః ప్రారంభం ఘనంగా జరుగుతుందని ప్రకటించారు. తిరుమల మాదిరిగానే మన రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రారంభం మన చేతుల్లో ఉండదని, ఆగమ, వాస్తు వంటి పలు శాస్త్రోక్త పద్ధతులలో చేయాల్సి ఉంటుందని చెప్పారు.



50 ఏళ్ల కిందట దర్శించుకున్నా.. 
గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన మన తెలంగాణ ఆధ్యాత్మిక రంగంలోని పరిమళాలను నూతన చరిత్రకారులు వెలికితీస్తున్నారని అన్నారు. మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని తాను 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక  పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశామని చెప్పారు.

విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం ఖరారు  
మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమ ముహూర్తాన్ని జీయర్‌ గారి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో నిర్ణయించడం జరిగిందని, మహా సుదర్శన యాగంతో ఇది ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సహస్రాశ్ట (1008) కుండలతో దీనిని నిర్వహించడం జరుగుతుందని, 6 వేల మంది ఋత్విక్కులు, 3 వేల మంది సహాయకులు పాల్గొంటారని చెప్పారు. జీయర్‌స్వామి పీఠంలో శ్రీమద్రమానుజ 1004వ జయంతి సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహిస్తున్నారని, అక్కడ యాగం పూర్తి కాగానే యాదాద్రిలో యాగం ప్రారంభం అవుతుందని చెప్పారు.

ఉద్ఘాటనకు దేశ, విదేశాలకు చెందిన పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ దీవించాలని కోరారు. మహా సుదర్శన యాగ కార్యానికి లక్షా యాభై వేల కిలోల కల్తీ లేని నెయ్యి వినియోగిస్తున్నట్లు తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, పనులను రేపటి నుంచి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.


ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు, మోత్కుపల్లి 

స్వర్ణతాపడంలో ప్రజలందరికీ భాగస్వామ్యం 
స్వామివారి గర్భగుడి దివ్య విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుందన్నారు. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. గౌరవ ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు,  3,600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరినీ భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు.

రూ.11 నుంచి ఎంత వీలైతే అంత చెల్లించాలని కోరారు. మొట్ట మొదటగా తమ కుటుంబం నుంచి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రులు మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇలా పలువురు బంగారం విరాళంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుంచి పదకొండు రూపాయల చొప్పున ఇచ్చినా సంతోషమేనని అన్నారు.  ఈ ఆలయం మనది అనే భావనతో అందరూ స్వామివారి కార్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



అంతర్జాతీయ స్థాయిలో కాటేజీలు  
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించే విధంగా వెయ్యి సూట్లతో 250 కాటేజీల నిర్మాణం వెంటనే చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. వెయ్యి ఎకరాలలో టెంపుల్‌ సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి,  రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి వెళ్లిన భక్తులు నాలుగైదు రోజులు అక్కడే ఎలా ఉంటారో యాదాద్రిలో కూడా అలాగే ఉండాలన్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి పనులు వేగంగా పూర్తి చేస్తామని, రూ.6.90 కోట్లతో బస్టాండ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ఉచిత బస్సు కోసం బస్టాండ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ జలమండలి సహాయంతో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్లేలా) పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్‌ కలిసి జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని, చక్కని కాలనీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. జర్నలిస్టులు దేవాలయ మార్పు చూసినవారు కాబట్టి ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సూచించారు.   

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ  
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని సీఎం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 60 లక్షల ఎకరాలలో పంట రాబోతోందని చెప్పారు. ఒంటరి మహిళలకు పెన్షన్‌లు, కులం జాతి అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నవంబర్‌ 4వ తేదీ తర్వాత దళిత బంధు పథకం ద్వారా దళిత బిడ్డల ఆర్థిక ఉన్నతికి పది లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. యాదాద్రిపై యాదర్షి ఋషి పేరుతో మెడిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు కూడా జరుగుతుందన్నారు. అలాగే బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప ఆకర్షణీయమైన కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

కాళేశ్వరంలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ రూపుదిద్దుకుందని, మల్లన్న సాగర్‌ నుంచి ప్రతిరోజూ స్వచ్ఛమైన గోదావరి జలాలు లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలను తాకడం మన అదృష్టమని పేర్కొన్నారు. దీనితో ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని,  ఇది స్వామి వారి దీవెన అని కొనియాడారు. తెలంగాణ బిడ్డ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ కిషన్‌రావు మన శిల్పారామం సృష్టికర్త అని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం చక్కగా అవిష్కృతం అవుతోందన్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నర్సింహాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యాదాద్రి ల‌క్ష్మిన‌రసింహ స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్ ఫొటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement