మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్‌ | CM Revanth lays foundation stone for cognizant second campus in Hyderabad | Sakshi
Sakshi News home page

మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్‌

Published Wed, Aug 14 2024 5:48 PM | Last Updated on Wed, Aug 14 2024 6:16 PM

CM Revanth lays foundation stone for cognizant second campus in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్‌ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్‌లో కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.  మూడోది రీజనల్ రింగ్ రోడ్  బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ  అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. 

కాగ్నిజెంట్‌ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను.  హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది.  హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. హైదరాబాద్‌లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. 

రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement