సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. నిష్పక్షపాత విచారణ జరిపించి.. కాంట్రాక్టులు ఎవరిచ్చారో, సమస్యలకు కారణం ఎవరో తేల్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వంలో నచ్చితే నజరానా (పురస్కారం), నచ్చకపోతే జుర్మానా (జరిమానా) ఉండవని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో శనివారం చేపట్టిన ధన్యవాద తీర్మానం చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడ్డాయని.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మాత్రం కళ్లముందే కుంగిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటిది తామేదో గొప్ప ప్రాజెక్టు కట్టామని, చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టును ఇసుకపై కట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులను తీసుకెళ్లి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను చూపిస్తామన్నారు.
సాంకేతిక నిపుణులతో పరిశీలించాలి..
సీఎం రేవంత్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం వద్ద ఏదో ఘోరం జరిగిపోయిందంటూ.. ఏదో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టు శాసనసభ, మండలి సభ్యులను తీసుకెళ్లడం కంటే సాంకేతికంగా నిపుణులతో పరిశీలించడం మంచిదని సూచించారు. తాము ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
దీనిపై రేవంత్ ప్రతిస్పందిస్తూ.. మేడిగడ్డ పరిశీలనకు బీఆర్‌ఎస్ వారు రానంటే తమకు అభ్యంతరమేమీ లేదని, మిగతా సభ్యులకు అవకాశం కల్పిస్తే బీఆర్‌ఎస్ వారికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం వద్ద బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా సరే.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మహాలక్ష్మి పథకం అమలు, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం వంటి హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు.
చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం
మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది తమ గ్యారంటీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక.. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మార్పు, టీచర్లు–ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో, స్కూల్ సర్విసెస్, జీతాలు వంటి అంశాలపై ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసుకొస్తుందని, రైతుబీమా పథకాన్ని కూడా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
నా భాష ఇలాగే ఉంటుంది..!
అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించే విషయంపై అన్నిపార్టీలతో చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజానికి ఈ ప్రాంగణం ప్రభుత్వ పరిధిలోనిది కాదని.. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ సమావేశమై ఏ ఆదేశాలిస్తే వాటిని పాటిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో సీఎం సంయమనం, సహనంతో ఉండాలని, పరుష పదజాలంతో భయపెట్టేలా మాట్లాడవద్దని కోరుతున్నామని దేశపతి పేర్కొన్నారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘గ్రామం నుంచి వచ్చాను. రైతుబిడ్డను. ప్రభుత్వ బడిలో చదువుకున్నాను, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భాష ఇలాగే ఉంటుంది. ఏం అనుకున్నానో అదే చెబుతాను. నా మాటలకు తప్పు చేయనివారు ఎందుకు భయపడాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి నమూనా చేస్తాం
హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే అభివృద్ధి నమూనాగా మార్చుతామని సీఎం రేవంత్ చెప్పారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో కళకళలాడేలా చేస్తామని.. మూసీ పరీవాహకం మొత్తం (నల్లగొండ దాకా>) ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకు శాసన మండలిపై ప్రత్యేక అభిమానం ఉందని.. పదిహేనేళ్ల కింద తాను ఎమ్మెల్సీగా అడుగుపెట్టి సీనియర్ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాగా.. మైనారిటీలకు ఇచ్చిన రూ.లక్ష సబ్సిడీ చెక్కు బౌన్స్ అయిందని, ఆ సొమ్మును ఇప్పించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ కోరగా.. గతంలో ఉన్నది నకిలీ ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ సొమ్ముపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
కవిత సవరణ.. వెనక్కి..
ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో భాషా ప్రయోగం సరిగా లేదని, దానిని మార్చాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు ధన్యవాద తీర్మానానికి సవరణలు కోరారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు కల్పించుకుని.. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, సవరణ డిమాండ్‌ను ఉప సంహరించుకోవాలని కోరారు.
కవిత ప్రతిస్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని భాషతో తాము ఏకీభవించడం లేదని, దానిపై నిరసన తెలుపుతూనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరణ డిమాండ్‌ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. కాగా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల సమయంలో మండలిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి తెచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment