ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మాణం
రూ.2 వేల కోట్ల వ్యయంతో 5.5 కి.మీ. మేరకు..
రెండోదశలో ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు...
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించింది.
డ్రోన్ సర్వే...
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్‌షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్‌లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్‌లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్‌జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది.
ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్‌మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment