సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.
వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు
..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్‌పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ‘జీహెచ్‌ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment