న్యూజెర్సీ/తెలంగాణ: రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘‘తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇది ప్రారంభం మాత్రమే.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుంది. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తాం.
ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్‌తో పాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment