సాక్షి, నాంపల్లి: భూ తగాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తూ మానసికంగా వేధిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముచ్యంతల సమ్మిరెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో (హెచ్చార్సీ) ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజిరెడ్డి పేరిట 2.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన తమ్ముడు సదాశివరెడ్డి జమ్మికుంట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సృజన్‌రెడ్డి 17 జూలై 2019న అన్నదమ్ములిద్దరిని పిలిపించి రాజీ కుదిర్చినట్లు వివరించారు. ఇరువురి సమక్షంలో తనకు 1–07 ఎకరాలు, తన తమ్ముడు సదాశివరెడ్డికి 1–01 ఎకరాల భూమిని పంచి ఒప్పందం కుదిర్చారని తెలిపారు. అనంతరం అట్టి భూమిని తన తండ్రి సమక్షంలో అన్నదమ్ములిద్దరి పేరిట విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు.
అయితే తనకు 3 గుంటల భూమిని ఎక్కువగా ఇప్పించినందుకు గాను సీఐ సృజన్‌రెడ్డి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో సీఐ తన తమ్ముడితో కుమ్మక్కై అసభ్య పదజాలంతో దూషిస్తూ, కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనపై మూడు తప్పుడు కేసులు బనాయించి బైండోవర్ చేశాడన్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, సీఐ సృజన్‌రెడ్డి, తన తమ్ముడు సదాశివరెడ్డి తదితరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment