
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రూపు రాజకీయాల నడుమ టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి పరీక్ష కాబోతోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తానని చెపుతున్న రేవంత్ హుజూరాబాద్‌లో ఏ వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం మొదలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేంతవరకు నడిచిన ఎపిసోడ్‌లో కాంగ్రెస్ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో టీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే హుజూరాబాద్‌లో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా ఈటల రాజేందర్, ఈటలను ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా, మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్‌లో మకాం వేసి ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. ఈటల ద్వారా సమకూరిన బలంతో బీజేపీ కూడా పోరాటానికి సై అంటోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ తరఫున ఇప్పటివరకు పెద్దగా కార్యక్రమాలేవీ జరగలేదు.
రేవంత్ రాకతో నయా జోష్..?
పీసీసీ పీఠం కోసం కాంగ్రెస్‌లో చాన్నాళ్లుగా సాగిన వర్గపోరులో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో ఆయన త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఎదుర్కోబోతున్న తొలి ఉప ఎన్నిక హుజూరాబాద్ కాబోతోంది. ఉప ఎన్నికలో గెలిస్తేనే సత్తా చాటినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డిని సోమవారం కలిసి అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ నుంచి తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని, గెలిచే అభ్యర్థిని తానేనని చెప్పినట్లు సమాచారం.
పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వరుసకు సోదరుడైన కౌశిక్‌రెడ్డి విషయంలో ఇప్పటివరకు భేదాభిప్రాయాలు ఉన్నా, వాటికి ఫుల్‌స్టాప్ పడేలా ఈ కలయిక సాగింది. అలాగే టీఆర్‌ఎస్ టికెట్టు కోసం కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే వదంతులను నమ్మవద్దని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు కౌశిక్‌రెడ్డి మినహా ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరూ లేకపోవడం, పీసీసీ మార్పు వంటి పరిణామాలతో హుజూరాబాద్‌లో జోష్ వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. తదనుగుణంగా వ్యూహాలను అమలు చేసే ఆలోచనతో రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్, బీజేపీలను ఎండగట్టే వ్యూహంతో..
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్, బీజేపీలపై దాడి ప్రారంభించారు. నాణేనికి రెండు పార్టీలు బొమ్మ బొరుసు అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈటలను టీఆర్‌ఎస్ కోవర్టుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌లో రాజకీయ వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకటే అనే సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడం, రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా కార్యకర్తలు చెపుతున్నారు.
ఉప ఎన్నిక కోసం హుజూరాబాద్‌లోనే నెలరోజులపాటు మకాం వేయనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారని ఆయనను కలిసి వచ్చిన కౌశిక్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అదే సమయంలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా హుజూరాబాద్‌కు వస్తారని, మిగతా నేతలు కూడా ఉప ఎన్నిక కోసం రానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment