సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు బీజేపీయే ప్రత్యామ్నాయం అంటూ పదే పదే వ్యాఖ్యానించడం, సోనియాను ఈడీ విచారించడం సరైనదే అన్నట్టుగా.. చట్టం తనపని తాను చేసుకుని పోతుందంటూ మాట్లాడటాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం.
లాభనష్టాలపై నేతల తర్జనభర్జనలు
రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కలు చర్చించారు. ఆయనపై వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినా.. దానివల్ల లాభమా..? నష్టమా..? అన్న అంశంపై తర్జన భర్జనలు పడినట్లు తెలిసింది. తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చి తర్వాత సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన వ్యవహారం పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడినట్లు తెలిసింది.
చర్య తీసుకోకపోతే ఇంత జరుగుతున్నా అధిష్టానం మౌనంగా ఉందన్న సంకేతాలు వెళ్తాయని, ఒకవేళ వెంటనే చర్య తీసుకుంటే ఆయన వెళ్లడానికి మార్గం సుగమం చేసినట్లు అవుతుందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. మొత్తం మీద సస్పెండ్ చేయడానికే మొగ్గు చూపే అకాశాలున్నాయని సమాచారం. ఈ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించినా.. ఆరోగ్యం బాగాలేక రాలేదని తెలిసింది. కాగా ఇటీవలి కాలంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన ప్రతి వీడియోను ఏఐసీసీ వర్గాలు పరిశీలించినట్లు తెలిసింది. తాజా పరిణామాలపై బుధవారం విచారణ అనంతరం మాణిక్యం ఠాగూర్.. కేసీ వేణుగోపాల్‌కు నివేదిక సమర్పించినట్టు సమాచారం.
అనుచరులతో రాజగోపాల్ వరుస భేటీలు
మరోవైపు రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ తమకు ఏ విధంగా అన్యాయం చేసిందో వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, పార్టీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ కోసం పోరాడిన వారికి విలువ, గౌరవం లేదని అన్నట్టు సమాచారం. తాను బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావడంతో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందంటే అందుకు ఏడాదిన్నర ముందు పదవీ త్యాగానికి సిద్ధమని ఆయన అనుచరులతో స్పష్టం చేశారు.
శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌తో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్టుగా చెప్పారని సమాచారం. ఇంకోవైపు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికను బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కాగా బుధవారం రాత్రి ఆయనతో రాజగోపాల్‌రెడ్డి ఓ ఫామ్‌హౌస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీలో చేరడానికి ముందు రాజగోపాల్ సర్వే చేయించుకుంటున్నారని తెలిసింది.
స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ?
ఢిల్లీ వెళ్తున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి అమిత్‌షాను మరోసారి కలిసే అవకాశమున్నట్టు తెలిసింది. పార్టీ మారడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. తానే స్వయంగా స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలని కోరతారని వారు చెబుతున్నారు. ఆయన రాజీనామా గనుక ఆమోదం పొందితే ఉప ఎన్నిక తప్పదని బీజేపీ నేతలంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో లాగే మునుగోడుపైనా కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
బ్రదర్స్ మధ్యే పోటీయా?
కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే, అది ఆమోదం పొందితే, ఉప ఎన్నిక జరిగితే.. దాని ఎఫెక్ట్ వెంకట్‌రెడ్డిపై ఉంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. మునుగోడులో వెంకట్‌రెడ్డినే అభ్యర్థిగా పెట్టాలన్న చర్చ కూడా ఏఐసీసీలో జరిగినట్టు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు కూడా ఒకటి కావడం వెంకట్‌రెడ్డికి కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఇందుకు వెంకటరెడ్డి అంగీకరించాల్సి ఉండగా.. అన్నదమ్ములు కనుక పోటీ పడితే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment