
సాక్షి, హైదరాబాద్: ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా కరెంటు ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రైతులకు నిరంతర విద్యుత్‌ను ఇవ్వని ప్రభుత్వం, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 13న అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని, రైతులకు రోజుకు 10 గంటలు కూడా కరెంటు అందడంలేదని ఆయన విమర్శించారు. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తీరు ఇలానే ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment