సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు.
మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని గుర్తు చేశారు. బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందని అన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని తెలిపారు.
తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే పదవులు వస్తాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శాసన మండలిలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు బల్మూరి వెంకట్. 9 సంవత్సరాలు తనతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment