సాక్షి, హైదరాబాద్/ నిజామాబాద్ అర్బన్: కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాష్ట్రంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. పాజిటివ్ వ్యక్తులు భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దాదాపు అన్ని హాస్పిటళ్లలో వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. ఎక్కడైనా బెడ్ ఖాళీ అయితే వెంటనే మరో పాజిటివ్ పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడు. కొన్ని ఆస్పత్రులు మూడు నాలుగు రోజుల పాటు అత్యవసర విభాగంలో ఉంచి వైద్యసేవలు అందిస్తుండగా.. మరికొన్ని అందుకు నిరాకరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నా బాధితులు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు.
కోవిడ్ వార్డులన్నీ నిండి..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,459 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో వెంటిలేటర్‌పై 2వేల మందికి పైగా, ఆక్సిజన్ పడకలపై 4వేల మందికిపైగా, జనరల్ వార్డుల్లో 2 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. 16,982 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిలో కొందరు వైరస్ లోడ్ పెరిగి.. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ వార్డుల్లోని పడకలు రోగులతో నిండిపోవడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరైనా డిశ్చార్జి అయి బెడ్ ఖాళీ అయితేగానీ కొత్త వారిని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. ఇలా హైదరాబాద్‌లోని ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో 20 మందికిపై గా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం.
పడకలు ఖాళీ లేని ఆస్పత్రులివే..
బొగ్గులకుంట ఆదిత్య, హైదర్‌గూడ అపోలో, అవేర్ గ్లోబల్, బసవతారకం, బ్రిస్టల్‌కాన్ ఆస్పత్రులు (హయత్‌నగర్, బర్కత్‌పురా), ముషీరాబాద్ కేర్, ఖైరతాబాద్ గ్లోబల్, సికింద్రాబాద్ సన్‌షైన్, కాచిగూడ టెక్స్ ఆస్పత్రి, అమీర్‌పేట్ వెల్‌నెస్ సెంటర్, సికింద్రాబాద్ యశోదా, ఉప్పల్ ఆదిత్య, అల్వాల్ ఎక్స్‌ఎల్ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని కేకేరెడ్డి ఆస్పత్రి, కూకట్‌పల్లి మన ఆస్పత్రి, న్యూబోయిన్‌పల్లి రాఘవేంద్ర ఆస్పత్రి, కేపీహెచ్‌బీ కాలనీలోని శానిక్య, ఉప్పల్ స్కిమ్స్ ఆస్పత్రి, పీర్జాదిగూడ స్పార్క్ ఆస్పత్రి, మదీనాగూడ అర్చన ఆస్పత్రి, వనస్థలిపురం ఏవీవైఏ ఆస్పత్రి, కొత్తపేట ఓమ్నీ, చందానగర్ పీఆర్‌కే ఆస్పత్రి, గచ్చిబౌలి సన్‌షైన్ ఆస్పత్రి, చందానగర్ మెడికవర్, బాగ్ అంబర్‌పేటలోని సీజన్స్ ఆస్పత్రుల్లోని పడకలు పూర్తిగా నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో కొత్తగా ఎవరైనా వస్తే ఎమర్జెన్సీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వార్డులో పడకలు ఖాళీ అయితే అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో కూడా నగదు చెల్లించే రోగులకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది.
ఖాళీ పడకలు రెండు, మూడే...
గచ్చిబౌలి ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో 200 పడకలకు నాలుగు, కాంటినెంటల్ ఆస్పత్రిలో 153 పడకలకు నాలుగు మాత్రమే ఖాళీగా ఉన్నా యి. హిమగిరి ఆస్పత్రిలో 50 పడకలకు ఒకటి, కూకట్‌పల్లి పద్మజా ఆస్పత్రిలో 24కు రెండు, ఏఎస్ రావునగర్ పౌలోమి ఆస్పత్రిలో 25 పడకలకు రెండు, పల్స్ హార్ట్ సెంటర్‌లో 28 పడకలకు ఒకటి, ఈసీఐఎల్ శ్రేయ ఆస్పత్రిలో 30 పడకలకు రెండు, జీడిమెట్ల సిగ్మాలో 24 పడకలకు మూడు, సికింద్రాబాద్ శ్రీకరలో 48 పడకలకు రెండు, ఈసీఐఎల్ జినియాలో 19 పడకలకు ఒకటి, సోమాజిగూడ జోయ్ లో 14 పడకలకు రెండు, అత్తాపూర్ జోయ్‌లో 28 పడకలకు రెండు, ప్రీమియర్‌లో 38కి మూడు, ప్రిన్సెస్ ఇస్రా 50 పడకలకు రెండు, లంగర్‌హౌస్‌లోని రెనోవాలో 50 పడకలకు రెండు, బర్కత్‌పుర సీసీ సెరఫ్ ఆస్పత్రిలో 19 పడకలకు ఒకటి, బంజారాహిల్స్ కేర్‌లో 70 పడకలకు నాలుగు, కొండాపూర్ కిమ్స్‌లో 80 పడకలకు రెండు, సికింద్రాబాద్ కిమ్స్‌లో 305 పడకలకు నాలుగు, సికింద్రాబాద్ అపోలో రెండు, డీఆర్‌డీఓ అపోలో రెండు పడకల చొప్పున మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
బెడ్లు బ్లాక్ చేస్తున్న కొన్ని ఆస్పత్రులు
కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పడకలను బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వ టారిఫ్‌కు కాకుండా ఆస్పత్రులు వేసే బిల్లు చెల్లించేందుకు ఒప్పుకొంటున్న వారినే చేర్చుకుంటున్నారు. మిగిలిన వారిని బెడ్లు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగుల నుంచి రోజుకు రూ.50 వేల వరకు చార్జి చేస్తున్నారు. పడకలు దొరకడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో రోగుల బంధువులు మారుమాట్లాడకుండా అడిగినంత బిల్లు చెల్లించాల్సి వస్తోంది.
పరిస్థితి విషమించి గాంధీకి పరుగులు
వైరస్ లోడ్ ఎక్కువగా ఉండి, చికిత్సకు సరిగా స్పందించని రోగులను, ఇంకా డబ్బు చెల్లించే స్తోమత లేనివారిని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు బలవంతంగా వదిలించుకుంటున్నాయి. అలాంటి వారిని చివరి నిమిషంలో గాంధీకి పంపిస్తున్నాయి. ఇందులో కొందరికి అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో జరుగుతున్న కోవిడ్ మరణాల్లో 80 శాతం వరకు చివరి నిమషంలో రిఫరల్‌పై వచ్చిన కేసులే ఉంటున్నాయి.
నిజామాబాద్‌లో ఆస్పత్రులకు కరోనా రోగుల తాకిడి
నిజామాబాద్ జిల్లాలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కరోనా చికిత్సకు అనుమతి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. కొత్తగా కరోనా బారిన పడి, ఆరోగ్యం విషమంగా మారిన వారికి బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడిలో పది వరకు ఆస్పత్రులు అనుమతి లేకున్నా కరోనా చికిత్స అందిస్తున్నాయి. వాటిల్లో సైతం పడకలు నిండిపోయాయి. దాంతో బాధితుల్లో కొందరు హైదరాబాద్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అసలు కరోనా బాధితులు, వారి బంధువులతో ఖలీల్‌వాడి ప్రాంతం కిటకిటలాడుతోంది. ఇదే అదనుగా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిట్ అవడానికి ముందే రూ.లక్షకుపైగా అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు.
బెడ్స్ లేక.. ఆస్పత్రి గేటు వద్దే కోవిడ్ రోగి
నిర్మల్ జిల్లా ఆస్పత్రికి బుధవారం ఓ కోవిడ్ పేషెంట్‌ను తీసుకొచ్చారు. సరిపడా బెడ్స్ లేకపోవడంతో ఆస్పత్రి గేటు ముందే స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. సదరు పేషెంట్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆస్పత్రి పారిశుధ్య సిబ్బంది వచ్చి ఆ స్ట్రెచర్ వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లి వెళ్లిపోయారు. చివరికి ఆ పేషెంట్‌ను హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతో కుటుంబసభ్యులు గంట తర్వాత తరలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
కార్పొరేట్ కరోనా పడకలు ఫుల్..!
Published Thu, Apr 15 2021 5:31 AM | Last Updated on Thu, Apr 15 2021 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment