Beds shortage
-
ఎంజీఎం: ఒకరు కన్నుమూస్తేనే మరొకరికి బెడ్
వరంగల్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి. అలాంటి ఈ ఆస్పత్రిలో 800 పడకలతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. కోవిడ్ వార్డు లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా మృతి చెందితే తప్ప కొత్త వారికి బెడ్ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాగా, కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంకు తీసుకొచ్చారు. అక్కడి ఆర్ఎంఓ, సిబ్బందికి తమ సమస్య చెప్పినా వారెవరూ పట్టించుకోలేదు. పడకలు ఖాళీగా ఉన్నా, ఫ్లో మీటర్లు లేనందున ఆక్సిజన్ పెట్టలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆ మహిళ గంటల తరబడి వార్డు బయటే వేచి ఉన్నారు. ఎలాగైనా ఆక్సిజన్ పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని కోరుతున్న క్రమంలోనే, అప్పటికే చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మృతి చెందాడు. దీంతో మళ్లీ సిబ్బందిని బతిమిలాడగా, అప్పుడు ఆ మహిళకు బెడ్‌ను కేటాయించి చికిత్స ప్రారంభించారు. చదవండి: ఇలా ఐతే.. వైద్యం ఎలా ? -
కార్పొరేట్ కరోనా పడకలు ఫుల్..!
సాక్షి, హైదరాబాద్/ నిజామాబాద్ అర్బన్: కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాష్ట్రంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. పాజిటివ్ వ్యక్తులు భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దాదాపు అన్ని హాస్పిటళ్లలో వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. ఎక్కడైనా బెడ్ ఖాళీ అయితే వెంటనే మరో పాజిటివ్ పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడు. కొన్ని ఆస్పత్రులు మూడు నాలుగు రోజుల పాటు అత్యవసర విభాగంలో ఉంచి వైద్యసేవలు అందిస్తుండగా.. మరికొన్ని అందుకు నిరాకరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నా బాధితులు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ వార్డులన్నీ నిండి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,459 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో వెంటిలేటర్‌పై 2వేల మందికి పైగా, ఆక్సిజన్ పడకలపై 4వేల మందికిపైగా, జనరల్ వార్డుల్లో 2 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. 16,982 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిలో కొందరు వైరస్ లోడ్ పెరిగి.. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ వార్డుల్లోని పడకలు రోగులతో నిండిపోవడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరైనా డిశ్చార్జి అయి బెడ్ ఖాళీ అయితేగానీ కొత్త వారిని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. ఇలా హైదరాబాద్‌లోని ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో 20 మందికిపై గా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం. పడకలు ఖాళీ లేని ఆస్పత్రులివే.. బొగ్గులకుంట ఆదిత్య, హైదర్‌గూడ అపోలో, అవేర్ గ్లోబల్, బసవతారకం, బ్రిస్టల్‌కాన్ ఆస్పత్రులు (హయత్‌నగర్, బర్కత్‌పురా), ముషీరాబాద్ కేర్, ఖైరతాబాద్ గ్లోబల్, సికింద్రాబాద్ సన్‌షైన్, కాచిగూడ టెక్స్ ఆస్పత్రి, అమీర్‌పేట్ వెల్నెస్ సెంటర్, సికింద్రాబాద్ యశోదా, ఉప్పల్ ఆదిత్య, అల్వాల్ ఎక్స్ఎల్ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని కేకేరెడ్డి ఆస్పత్రి, కూకట్పల్లి మన ఆస్పత్రి, న్యూబోయిన్‌పల్లి రాఘవేంద్ర ఆస్పత్రి, కేపీహెచ్‌బీ కాలనీలోని శానిక్య, ఉప్పల్ స్కిమ్స్ ఆస్పత్రి, పీర్జాదిగూడ స్పార్క్ ఆస్పత్రి, మదీనాగూడ అర్చన ఆస్పత్రి, వనస్థలిపురం ఏవీవైఏ ఆస్పత్రి, కొత్తపేట ఓమ్నీ, చందానగర్ పీఆర్కే ఆస్పత్రి, గచ్చిబౌలి సన్‌షైన్ ఆస్పత్రి, చందానగర్ మెడికవర్, బాగ్ అంబర్‌పేటలోని సీజన్స్ ఆస్పత్రుల్లోని పడకలు పూర్తిగా నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో కొత్తగా ఎవరైనా వస్తే ఎమర్జెన్సీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వార్డులో పడకలు ఖాళీ అయితే అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో కూడా నగదు చెల్లించే రోగులకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది. ఖాళీ పడకలు రెండు, మూడే... గచ్చిబౌలి ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో 200 పడకలకు నాలుగు, కాంటినెంటల్ ఆస్పత్రిలో 153 పడకలకు నాలుగు మాత్రమే ఖాళీగా ఉన్నా యి. హిమగిరి ఆస్పత్రిలో 50 పడకలకు ఒకటి, కూకట్పల్లి పద్మజా ఆస్పత్రిలో 24కు రెండు, ఏఎస్ రావునగర్ పౌలోమి ఆస్పత్రిలో 25 పడకలకు రెండు, పల్స్ హార్ట్ సెంటర్లో 28 పడకలకు ఒకటి, ఈసీఐఎల్ శ్రేయ ఆస్పత్రిలో 30 పడకలకు రెండు, జీడిమెట్ల సిగ్మాలో 24 పడకలకు మూడు, సికింద్రాబాద్ శ్రీకరలో 48 పడకలకు రెండు, ఈసీఐఎల్ జినియాలో 19 పడకలకు ఒకటి, సోమాజిగూడ జోయ్ లో 14 పడకలకు రెండు, అత్తాపూర్ జోయ్‌లో 28 పడకలకు రెండు, ప్రీమియర్‌లో 38కి మూడు, ప్రిన్సెస్ ఇస్రా 50 పడకలకు రెండు, లంగర్‌హౌస్‌లోని రెనోవాలో 50 పడకలకు రెండు, బర్కత్‌పుర సీసీ సెరఫ్ ఆస్పత్రిలో 19 పడకలకు ఒకటి, బంజారాహిల్స్ కేర్‌లో 70 పడకలకు నాలుగు, కొండాపూర్ కిమ్స్‌లో 80 పడకలకు రెండు, సికింద్రాబాద్ కిమ్స్‌లో 305 పడకలకు నాలుగు, సికింద్రాబాద్ అపోలో రెండు, డీఆర్డీఓ అపోలో రెండు పడకల చొప్పున మాత్రమే ఖాళీగా ఉన్నాయి. బెడ్లు బ్లాక్ చేస్తున్న కొన్ని ఆస్పత్రులు కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పడకలను బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వ టారిఫ్‌కు కాకుండా ఆస్పత్రులు వేసే బిల్లు చెల్లించేందుకు ఒప్పుకొంటున్న వారినే చేర్చుకుంటున్నారు. మిగిలిన వారిని బెడ్లు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగుల నుంచి రోజుకు రూ.50 వేల వరకు చార్జి చేస్తున్నారు. పడకలు దొరకడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో రోగుల బంధువులు మారుమాట్లాడకుండా అడిగినంత బిల్లు చెల్లించాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి గాంధీకి పరుగులు వైరస్ లోడ్ ఎక్కువగా ఉండి, చికిత్సకు సరిగా స్పందించని రోగులను, ఇంకా డబ్బు చెల్లించే స్తోమత లేనివారిని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు బలవంతంగా వదిలించుకుంటున్నాయి. అలాంటి వారిని చివరి నిమిషంలో గాంధీకి పంపిస్తున్నాయి. ఇందులో కొందరికి అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో జరుగుతున్న కోవిడ్ మరణాల్లో 80 శాతం వరకు చివరి నిమషంలో రిఫరల్‌పై వచ్చిన కేసులే ఉంటున్నాయి. నిజామాబాద్‌లో ఆస్పత్రులకు కరోనా రోగుల తాకిడి నిజామాబాద్ జిల్లాలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కరోనా చికిత్సకు అనుమతి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. కొత్తగా కరోనా బారిన పడి, ఆరోగ్యం విషమంగా మారిన వారికి బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో పది వరకు ఆస్పత్రులు అనుమతి లేకున్నా కరోనా చికిత్స అందిస్తున్నాయి. వాటిల్లో సైతం పడకలు నిండిపోయాయి. దాంతో బాధితుల్లో కొందరు హైదరాబాద్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అసలు కరోనా బాధితులు, వారి బంధువులతో ఖలీల్‌వాడి ప్రాంతం కిటకిటలాడుతోంది. ఇదే అదనుగా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిట్ అవడానికి ముందే రూ.లక్షకుపైగా అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు. బెడ్స్ లేక.. ఆస్పత్రి గేటు వద్దే కోవిడ్ రోగి నిర్మల్ జిల్లా ఆస్పత్రికి బుధవారం ఓ కోవిడ్ పేషెంట్‌ను తీసుకొచ్చారు. సరిపడా బెడ్స్ లేకపోవడంతో ఆస్పత్రి గేటు ముందే స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. సదరు పేషెంట్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆస్పత్రి పారిశుధ్య సిబ్బంది వచ్చి ఆ స్ట్రెచర్ వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లి వెళ్లిపోయారు. చివరికి ఆ పేషెంట్‌ను హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతో కుటుంబసభ్యులు గంట తర్వాత తరలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
కరోనా : ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో..
సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. మెట్పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో వైద్యులు అతని తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆ వ్యక్తి ఉంటున్నది అద్దె ఇళ్లు కావడంతో ఆ ఇంటి యజమాని లోనికి అనుమతించలేదు. దీంతో ఆ కరోనా పేషెంట్ రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కరోనా పేషెంట్‌ను మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తితోపాటు, అతని భార్య, ఇద్దరు కూతుళ్లను ఆస్పత్రిలోని గదిలో క్వారంటైన్ చేశారు. అయితే కరోనా సోకిన వ్యక్తి యమమాని మాజీ కౌన్సిలర్ కావడం గమనార్హం. -
‘వారి కోసం 5 వేల పడకలు సిద్ధం’
న్యూఢిల్లీ: కరోనా పేషంట్ల కొరకు దాదాపు 5000 మంచాలు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. రాజధానిలో కరోనా పేషంట్ల కోసం ఆస్పత్రుల్లో మంచాలు లేవంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి dc మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకోవడానికి నిరాకరించాయి. దాంతో ఢిల్లీలో కరోనా పేషంట్లకు సరిపడా మంచాలు అందుబాటులో లేవంటూ తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పేషంట్ల కోసం 5 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి దాదాపు 1000 మంది కరోనా పేషంట్లు వేరు వేరు ఆస్పత్రుల్లో చేరారు. బెడ్లు లేకపోతే ఇది ఎలా జరిగేది’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి కూడా 5వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. (కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం) కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు పేషంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వ యాప్‌లో పొందుపర్చడం లేదని సత్యేంద్ర జైన్ తెలిపారు. అందుకే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా త్వరలోనే ఏయే హాస్పిటల్లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో వంటి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసులు 26,000 మార్కును దాటినందున తమకు సకాలంలో చికిత్స అందించడం లేదంటూ రాజధానిలోని పలువురు కరోనావైరస్ రోగులు, వారి కుటుంబాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టత ఇచ్చింది. ఢిల్లీలో శుక్రవారం 1,330 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 708కి పెరిగిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లే..) -
పెద్దాసుపత్రికి పురిటినొప్పులు!
వెనుకబడిన జిల్లా ఆఖరుకు ఆరోగ్య సౌకర్యాల్లోనూ వివక్షకు గురవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేల్లో దాదాపు 12 మంది టీడీపీ వారే అయినా.. అందులో ఇద్దరు మంత్రులుగా రాష్ట్రానికే సేవలందిస్తున్నా.. వీరిలో ఓ మహిళా మంత్రి ఉన్నా.. అనంతలోని అమ్మల ఆక్రందన చెవికెక్కని పరిస్థితి. కనీస ఆరోగ్య సౌకర్యాలు లేక మాతృమరణాలు పెరుగుతున్నా.. వారికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రసవ వేదనతో ఎందరో తల్లులు మృత్యువాత పడుతుండగా.. కళ్లు తెరవని పసికందులు తల్లి ప్రేమకు దూరమై మౌనంగా రోదిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గించడంలో భాగంగా ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) రాష్ట్ర వ్యాప్తంగా 19 గైనిక్ యూనిట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ ‘అనంత’ ఆస్పత్రికి ఒక్క యూనిట్ కూడా కేటాయించలేదు. దీని ప్రభావం గర్భిణులు, బాలింతలపై పడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు సర్వజనాస్పత్రిని తనిఖీ చేసిన ప్రతిసారీ మెరుగైన వైద్యం అందించాలని చెబుతున్నారే కానీ.. వైద్యుల సంఖ్య, మౌలిక సదుపాయాల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. మరోవైపు వైద్యులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రెండు యూనిట్లతోనే ఏళ్లుగా సర్దుబాటు సర్వజనాస్పత్రిలో గర్భిణులు, బాలింతల పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవంగా గైనిక్ వార్డులో రెండు యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్‌కు 30 పడకలుంటాయి. కానీ ఆస్పత్రిలో 250 మంది గర్భిణులు, బాలింతలుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులపై పని ఒత్తిడి ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. ఐపీతో పాటు ఓపీ మొత్తం కలుపుకుని 450 నుంచి 500 మంది వరకు వస్తుంటారు. బోధనాస్పత్రిలో యూనిట్‌కు ప్రొఫెసర్‌తో పాటు ఇద్దరు అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్లు, సీనియర్ రెసిడెంట్లు,ఇద్దరు జూనియర్ రెసిడెంట్లు ఉండాలి. సర్వజనాస్పత్రిలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న గర్భిణులు, బాలింతల సంఖ్య దృష్ట్యా 8 యూనిట్లు ఉండాలి. కానీ ఇక్కడ రెండు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజూ 30 ప్రసవాలు జరిగితే అందులో 10 సిజేరియన్లు ఉంటున్నాయి. ఇలా ప్రతి నెలా 900 మందికి ప్రసవాలు జరుగుతున్నాయి. యూనిట్లు పెరిగితే ప్రొఫెసర్లతో పాటు అసోసియేట్, అసిస్టెంట్లు వస్తారు. మెరుగైన వైద్య సేవలూ అందే అవకాశం ఉంది. అనంతలోనే ‘హైరిస్క్’ దేశ వ్యాప్తంగా లక్ష కేసుల్లో 130 మాతృమరణాలు సంభవిస్తున్నాయి. అదే ఏపీలో లక్ష మందికి 74 మంది, ‘అనంత’లో అయితే లక్షకు 40 మాతృ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మృతులంతా హైరిస్క్ గర్భిణీలే. రక్తహీనత, హైపర్‌టెన్షన్‌తో పాటు వివిధ రకాల సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. మాతృ మరణాలు తగ్గించాలని చెబుతున్న ప్రభుత్వం...ఆ స్థాయిలో వైద్యులను నియమించడం లేదు. ఒక వైద్యురాలు రోజూ దాదాపు 40 నుంచి 45 మంది గర్భిణులను చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం ఏవిధంగా సాధ్యపడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. మాతృ మరణాల తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా..మౌలిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమవుతోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కలెక్టర్ మాట బేఖాతర్ ఇటీవల జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో కలెక్టర్ వీరపాండియన్ గైనిక్ వార్డుకు అదనంగా ఏఎన్ఎంలను నియమించాలని డీఎంహెచ్ఓ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, సూపరింటెండెంట్ జగన్నాథ్‌కు సూచించారు. కానీ వారిద్దరూ కలెక్టర్ మాటలను చెడచెవినపెట్టారు. సర్వజనాస్పత్రిలో 12 మంది మెటర్నిటీ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా.. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మెటర్నిటీ అసిస్టెంట్ల పని కూడా వైద్యులే చేయాల్సి వస్తోంది. సర్దుకుంటేనే సేవలు ఈ చిత్రం చూడండి... రెండు మంచాలపై ముగ్గురు బాలింతలు ఎలా సర్దుకునే ఉన్నారో... ఒకరు విశ్రాంతి తీసుకోవాలంటే మరొకరు కూర్చోవాల్సిందే. చిన్నారులను పక్కన పెట్టుకుని ఎక్కడ కాళ్లు తగులుతాయోనన్న భయంతో బాలింతలు అల్లాడిపోతున్నారు. మరోవైపు చాలా సేపు కూర్చుండిపోవడం వల్ల సీజేరియన్ చేసి కుట్లు వేసిన చోట నొప్పిగా ఉందంటూ బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యూనిట్ అంటే 30 పడకలను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యూనిట్‌కు ఒక ప్రొఫెసర్.. ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ఇద్దరు జూనియర్ రెసిడెంట్లు అందుబాటులో ఉంటారు. యూనిట్లు పెరగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనిట్లు తప్పక పెరగాలి. రోజూ వందల మంది గర్భిణులకు సేవలందిస్తున్నాం. ఒక్క వైద్యురాలే అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మెటర్నిటీ సేవలు సైతం వైద్యులు చేస్తున్నారు. దీంతో పాటుగా విద్యార్థులకు నాలుగు పిరియడ్లు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో హైరిస్క్ కేసులు ఎలా చూడగలం.– డాక్టర్ షంషాద్‌బేగం, గైనిక్ హెచ్ఓడీ -
ఎంజీఎం కిటకిట
విష జ్వరాలతో పెద్దసంఖ్యలో దవాఖానలో చేరుతున్న రోగులు వేధిస్తున్న పడకల కొరత పడకేసిన వార్డుల నిర్వహణ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా భావించే ఎంజీఎం దవాఖాన సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేకపోతోంది. ఫలితంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 383 మంది మలేరియా, 67 మంది డెంగీ బారిన పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద ఈ అంచనా గణాంకాలను బట్టి ఏజెన్సీ ప్రాంతాలు సీజనల్ వ్యాధులతో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయనేది వాస్తవం. గత వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చోటుచేసుకుంటున్న వాతావారణ మార్పుల కారణంగా ప్రజలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ఇక జిల్లాలోనే పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలోనూ అదే విధమైన దుస్థితి తాండవిస్తోంది. ప్రధానంగా ఈ ఆస్పత్రిలో రోగులకు పడకల కొరత ప్రధాన సమస్యగా ఉంది. అదనపు వార్డులు, పడకలను సమకూర్చుకోవడంపై ఎంజీఎం వైద్యాధికారులు దృష్టిసారించడం లేదు. వారి తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా పిల్లల వార్డు.. ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రస్తుతం 350 మంది చిన్నారులు విషజ్వరాజలతో చికిత్స పొందుతున్నారు. వారిలో అధికులు ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. అయినా ఆయా ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం లేదు. దవాఖానలోని పిల్లల విభాగంలోని వార్డుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. 138 పడకలకుగానూ 346 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పడకల కొరత కారణంగా ఒకే పడకలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల వార్డులో ఏసీ పనిచేయకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. దీనికి తోడు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటంతో ఆయా వార్డులకు రోగుల బంధువుల తాకిడి బాగా పెరిగిపోయి సంత వాతావరణం కనిపిస్తోంది. ప్రైవేటు క్లినిక్‌లకు రోగులను తరలించకుంటూ.. ఎంజీఎంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు మధ్యాహ్న అయిందంటే చాలు కనిపించకుండా పోతున్నారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోగులు లోలోన కుమిలిపోతున్నారు. కొంతమంది డాక్టర్లు రోగులను తమ ప్రైవేటు క్లినిక్‌లకు తరలించుకొని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు పక్కా నిఘా ఉంచితే వివరాలన్నీ బట్టబయలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎంజీఎంలో వైద్యసేవలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.