హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. నాలుగు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 28న 403 కేసులు నమోదు కాగా, 29న 463 కేసులు, 30న 684 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం ఏకంగా 887 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 1,02, 10,906 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,08,776 కేసులు నమోదయ్యాయి. బుధవారం 59,297 టెస్టులు చేయగా, అందులో 887 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ లో 201 మంది కరోనా బారినపడ్డారని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 337 మంది కోలుకోగా, ఇప్పటివరకు 3,01,564 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో నలుగురు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,701 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 97.66 శాతానికి పడిపోయింది.
వృథా అవుతున్న 2.85 శాతం వ్యాక్సిన్లు
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గత నెల 31 నాటికి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేశారు. గురువారం నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా కార్యక్రమం మొ దలైంది. అయితే 31వ తేదీ నాటి నివేదిక ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారు 4,42,429 మంది టీకా వేయించుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2,41,311 మంది టీకా పొందారు. మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 12,64,026కు చేరింది. కాగా, తాజాగా బుధవారం ఒక్క రోజులో 60 ఏళ్లు పైబడిన 17,384 మందికి టీకా వేయగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 12,648 మందికి టీకా వేశారు. కాగా, 2.85 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment