ఎవరికి వారే హెయిర్‌ స్టైలిస్టులు  | Corona Time Hairstylist And Beauty Parlour Special Story | Sakshi
Sakshi News home page

ఎవరికి వారే హెయిర్‌ స్టైలిస్టులు 

Published Wed, Sep 30 2020 8:30 AM | Last Updated on Wed, Sep 30 2020 8:37 AM

Corona Time Hairstylist And Beauty Parlour Special Story - Sakshi

‘అసలే కరోనా.. పిల్లలకు కటింగ్‌ పెరిగింది..సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది.. అందుకే నేనే వారికి ఇంట్లో నేనే కటింగ్‌ చేశా ’ అని బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్‌ చెప్పాడు. ఇలా నగరంలో చాలా మంది పిల్లలకు కటింగ్‌ చేయడంతోపాటు సొంతంగా తామే చేసుకుంటున్నారు. సెలూన్‌ ఎట్‌ హోమ్‌..అవును ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్‌. ఎవరి ఇళ్లల్లో వారే హెయిర్‌ కటింగ్‌ చేసుకుంటున్నారు. అవసరమైతే భార్య, పిల్లల సైతం సహాయం కోరుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు హెయిర్‌ కట్‌ చేస్తున్నారు. సెలూన్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మగువల బ్యూటీపార్లర్లు సైతం ఇళ్లల్లోనే వెలిశాయి.

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మోసుకొచ్చిన సరికొత్త జీవన శైలి ఇది. సెలూన్‌లు, పార్లర్లకు వెళ్లేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కోవిడ్‌ కారణంగా  అన్ని రంగాల్లో సరికొత్త పోకడలు ముందుకు వచ్చేశాయి. చివరకు హెయిర్‌ కటింగ్‌ కోసం కూడా బయటకు వెళ్లకుండా వైరస్‌ కట్టడి చేసింది. ఇందుకోసం యూట్యూబ్‌ పాఠాలు సైతం దొహదం చేస్తున్నాయి. నచ్చిన పద్ధతిలో, చక్కటి ఆకృతిలో  హెయిర్‌ కటింగ్‌  చేసుకొనేందుకు యూట్యూబ్‌ శిక్షణనిస్తోంది. ఇదే సమయంలో  ఇంటి వద్దకు  వచ్చి సర్వీసులు అందజేసే ఆన్‌లైన్‌ సంస్థలకు సైతం డిమాండ్‌ కనిపిస్తోంది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా  పనిచేసే  ఈ ఆన్‌లైన్‌ సంస్థలు  వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సాధారణ సెలూన్‌లు, బ్యూటీపార్లర్లకు  డిమాండ్‌  తగ్గుముఖం పట్టింది. కార్పొరేట్‌ సెలూన్‌ల మనుగడ సైతం  ప్రశ్నార్థకంగా మారింది.

సెలూన్‌ మనుగడ ప్రశ్నార్థకం
‘‘ఆరు నెలలైంది. గిరాకీ లేదు. మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. భవిష్యత్తుపై  ఆశలు సన్నగిల్లుతున్నాయి’’ నాగోల్‌ దగ్గర్లోని బండ్లగూడకు చెందిన ఉదయ్‌ అనే ఒక బార్బర్‌ ఆవేదన ఇది. చిన్న సెలూన్‌ అతనిది. కరోనాకు ముందు జీవితం సాఫీగా సాగింది. రోజుకు రూ.వెయ్యి పైనే లభించింది. కానీఇప్పుడు వారం  రోజులు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు. ఒక్క ఉదయ్‌ మాత్రమే కాదు. నగరంలో వేలకొద్దీ సెలూన్‌ల పరిస్థితి ఇదే.. క్షౌ రవృత్తిదారుల సంఘాల అంచనాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో  సుమారు 30 వేల హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లు, మరో  10 వేలకు పైగా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలో కలిపి కనీసం 7 వేల నుంచి  8 వేల సెలూన్‌లు, పార్లర్లు గిరాకీ లేక  మూతపడినట్లు అంచనా. ఇంకా కొన్ని మూసివేత దిశగా ఉన్నాయి. కోవిడ్‌ మహమ్మారి  వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చితికిపోయాయి.
  
దూసుకెళ్తున్న ట్రిమ్మర్‌ 
సికింద్రాబాద్‌లోని ఒక కాస్మొటిక్‌ షోరూమ్‌లో  ప్రతి నెలా సుమారు 5 వేల ట్రిమ్మర్లను విక్రయిస్తారు. సాధారణంగా సెలూన్‌ నిర్వాహకులే వీటిని కొనుగోలు చేస్తారు. కానీ  గత జూలై నెలలో  ఆ ఒక్క షోరూమ్‌లోనే ఏకంగా 20 వేల ట్రిమ్మర్లను  విక్రయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అంతటా  ఆ నెలలో సుమారు  2.5 లక్షల  ట్రిమ్మర్ల విక్రయం జరిగినట్లు  అంచనా వేస్తున్నారు. ఒక్క హెయిర్‌ కటింగ్‌ కోసం, షేవింగ్‌ కోసం వినియోగించే  ట్రిమ్మర్లే కాదు. రేజర్లు, సీజర్లు, లోషన్లు, ఫోమ్‌లు, డిస్పోజల్‌ షీట్స్, కోంబ్స్‌ వంటి వాటి విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. వినియోగదారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. ఇలా కొనుగోలు చేస్తున్న వాళ్లలో  స్వయంగా హెయిర్‌ కటింగ్‌లు చేసుకొనేవాళ్లతో పాటు బార్బర్ల వద్ద సొంత వస్తువులను వినియోగించే వాళ్లు కూడా ఉన్నారు. చిన్న చిన్న హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లు మొదలుకొని కార్పొరేట్‌  సెలూన్‌లు, బ్యూటీపార్లకు వివిధ రకాల వస్తువులను విక్రయించే వ్యాపార సంస్థలు ఇప్పుడు నేరుగా  వినియోగదారులకే  విక్రయించడం  ఈ  సరికొత్త ట్రెండ్‌లో భాగమే. దీంతో బేగంబజార్, కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న కాస్మొటిక్‌ షోరూమ్‌లలో ఈ వస్తువుల అమ్మకాలు  భారీగా పెరిగాయి. రూ.కోట్లల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి.

కుదేలైన పార్లర్లు... 
తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ఒక  బ్యూటీపార్లర్‌  కోవిడ్‌కు ముందు స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా సేవలందజేసింది. వినియోగదారులు ముందస్తు అపాయింట్‌మెంట్లతో వచ్చేవారు. కానీ ఇప్పుడు వినియోగదారుల సంఖ్య మూడొంతుల మేరకు పడిపోయింది. ‘కోవిడ్‌ ప్రొటోకాల్‌ మేరకు సర్వీసులు అందజేస్తున్నప్పటికీ  వినియోగదారులు ముందుకు రావడం లేదు..’అని  నిర్వాహకులు శ్రీనివాస్‌ విస్మయం వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్‌కు చెందిన పేజ్‌ 18 సెలూన్‌ అండ్‌ అకాడమీ ఒక శిక్షణా సంస్థ. మహిళలకు, పురుషులకు విడి విడిగా సర్వీసులు అందజేస్తుంది. హెయిర్‌ డిజైనర్లకు శిక్షణనిస్తోంది.‘ఏడాది క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా  ఏర్పాటు చేసిన  అకాడమీ  భవితవ్యం ప్రశార్థకంగా మిగిలింది.’’అని ఆవేదన  వ్యక్తం చేశారు నిర్వాహకులు సతీష్‌కుమార్‌. 

కార్పొరేట్‌ సెలూన్లపైనా ప్రభావం 
ఈ క్రమంలోనే  కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన  కార్పొరేట్‌  బ్యూటీపార్లర్లు, సెలూన్‌లలోనూ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వివిధ సంస్థలకు చెందిన  వందలాది ఫ్రాంచైసీస్‌ మూతపడ్డాయి. నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన  నేచురల్స్, గ్రీన్‌ల్యాండ్స్, అలెగ్జాండర్, జావేద్‌ వంటి అనేక బడా సంస్థల్లో సైతం 60  శాతానికి పైగా ఆదాయం పడిపోయింది. సగానికి పైగా సిబ్బందిని కుదించారు. సికింద్రాబాద్‌లోని  ఓ కార్పొరేట్‌ సెలూన్‌లో కరోనాకు ముందు  ప్రతి నెలా రూ.25 లక్షలకు పైగా ఆదాయం లభించగా ఇప్పుడు రూ.8  లక్షలు కూడా రావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆన్‌లైన్‌ సంస్థలతో మరింత దెబ్బ.. 
ఇటీవల వినియోగంలోకి వచ్చిన ఆన్‌లైన్‌ సంస్థలు సెలూన్‌ల మనుగడను మరింత ప్రశ్నార్థకం చేశాయి. ఇళ్ల వద్దకే వెళ్లి సేవలందజేసే వెసులుబాటు కల్పించడంతో  చాలామంది ఆన్‌లైన్‌ సంస్థలను ఆశ్రయియిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సెలూన్‌లు, బ్యూటీపార్లకు గిరాకీ లేకుండా పోతోంది. సాధారణ సెలూన్‌లకే కాకుండా బడా కార్పొరేట్‌ సెలూన్‌లకు కూడా  ఆన్‌లైన్‌ సంస్థలు సవాల్‌ విరుతున్నాయి.  

వ్యక్తిగత రక్షణకే  
కరోనా నుంచి వ్యక్తిగత రక్షణ పొందేందుకే సెలూన్‌లకు వెళ్లడం లేదు. యూట్యూబ్‌లో చూసి స్వయంగా హెయిర్‌ కట్‌ చేసుకుంటున్నారు. పరిస్థితులు మారే వరకు తప్పదు మరి. –  సంతోష్, హైటెక్‌సిటీ 

పిల్లలకు నేనే హెయిర్‌ స్టైలిస్ట్‌  
పిల్లలకు సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది. అందుకే ఇంటి దగ్గర నేనే కట్‌ చేస్తున్నాను. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా  సెలూన్‌ కంటే ఇల్లే సేఫ్‌ కదా. –  ప్రశాంత్‌రెడ్డి, బిజినెస్‌మెన్, బోడుప్పల్‌ 

భవిష్యత్తు ప్రశార్థకమే  
గతంలో ప్రతి రోజూ కనీసం 30 మంది మహిళలు వివిధ రకాల సర్వీసుల కోసం వచ్చేవారు. ఇప్పుడు రోజులో ఐదుగురు కూడా రావడం లేదు. –  సుకన్య, బడంగ్‌పేట్,బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు  

ఒక పాలసీని రూపొందించాలి  
సెలూన్‌లను ప్రభుత్వం అన్ని విధాలుగా  ఆదుకోవాలి. ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి కుటుంబానికి రూ.50 వేల సహాయం అందజేయాలి.  –బాలకృష్ణ నాయీ,  క్షౌరవృత్తిదార్ల సంఘం అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement