సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా కార్యక్రమం ఎంత సజావుగా నిర్వహించాలని భావిస్తున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిన్ (కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్) యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని భావించారు. అయితే ఆ యాప్ కాస్తా మొరాయిస్తుండటంతో కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. లబ్ధిదారులు నిర్దేశిత టీకా కేంద్రానికి వెళ్లి చూస్తే, యాప్‌లో కొందరివి పేర్లు కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మెసేజ్‌లు వచ్చిన కేంద్రంలో కాకుండా ఇతర కేంద్రాల్లో కొందరి పేర్లు ఉంటున్నాయి. అంతేకాదు ఇంకొందరివైతే ఎక్కడా పేర్లు కనిపించట్లేదు.
మరికొందరివి వేరే జిల్లాల్లో ఉంటున్నాయి. అయితే ఏ కేంద్రంలో లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో గుర్తించే అవకాశం ఈ యాప్‌లో లేకపోవడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. లబ్ధిదారులకు మెసేజ్‌లు పంపిస్తే కొందరికి వారి మొబైల్ ఫోన్లకు వెళ్లట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిపేర్లు తప్పు రావడం, అడ్రస్‌లు వేరుగా ఉండటం, గుర్తింపు కార్డులో ఉన్న వివరాలకు, యాప్ లోని వివరాలకు పొంతన కుదరకపోవడం, వయసు తప్పుగా ఉండటం, హోదాలు మారిపోతుండటం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది.
కేంద్రానికి ఫిర్యాదు చేసినా..
డ్రై రన్ సందర్భంగానే ఈ యాప్‌లో సమస్యలున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నెల 16 నుంచి యాప్‌తో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో 50 శాతం కార్యక్రమం యాప్‌తో నడుస్తుంటే, మిగిలిన 50 శాతం మాన్యువల్ పద్ధతిలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పద్ధతి వద్దని, యాప్‌నే వినియోగించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో కింది స్థాయిలో వ్యాక్సిన్ వేసే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
లబ్ధిదారుల సహనానికి పరీక్ష..
టీకాలు పక్కదారి పట్టకుండా, అర్హులైన లబ్ధిదారులు అందరికీ చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే కోవిన్ యాప్ తయారు చేశారు. లబ్ధిదారులు టీకా కేంద్రానికి వచ్చాక వారి ఆధారాలను ధ్రువీకరించాలి. దీన్ని కోవిన్ యాప్‌లోని డేటాతో సరిపోల్చాలి. ఏమైనా దుష్ప్రభావాలు వచ్చినా, వ్యాక్సిన్లు మిగిలినా, వృథా అయినా ఆ వివరాలను కూడా తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలి. లబ్ధిదారుడికి ఏ కేంద్రంలో టీకా వేస్తారో కూడా కోవిన్ యాప్ ద్వారా వారి ఫోన్లకు మెసేజ్‌లు వెళ్తాయి. ఎలక్ట్రానిక్ టీకా ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్ ద్వారానే లబ్ధిదారులకు ఇవ్వాలి. యాప్ ద్వారా రోజుకు దేశవ్యాప్తంగా 50 లక్షల మంది లబ్ధిదారులకు టీకా వేసేలా తీర్చిదిద్దారని చెబుతున్నా.. ఆచరణలో అది కన్పించట్లేదన్న విమర్శలు ఉన్నాయి. 2జీ ఇంటర్నెట్ సామర్థ్యంలోనూ పని చేయగలదని చెబుతున్నా, 4జీకి కూడా స్పందించట్లేదని పేర్కొంటున్నారు. ఇలా యాప్ సక్రమంగా పనిచేయక పోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
వెనుదిరుగుతున్న లబ్ధిదారులు
ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యల వల్ల టీకా కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సరి చూసుకునే క్రమంలో తలెత్తే ఇలాంటి సమస్యలతో మరింత ఆలస్యం అవుతోంది. గంటలకొద్దీ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వైద్య సిబ్బంది అసహనంతో వెనుదిరుగుతున్నారు. టీకా వేసేది, తీసుకునేది వైద్య సిబ్బందే కాబట్టి కొన్నిచోట్ల మాన్యువల్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు.
ఆ జిల్లాలో 300 మంది పేర్లు గల్లంతు..
మహబూబ్‌నగర్ జిల్లాలో టీకా కోసం మొదట దరఖాస్తు చేసిన వారిలో 300 మందికి పైగా పేర్లు యాప్‌లో కన్పించట్లేదు. పేర్లు లేని వారికి ఆఫ్‌లైన్‌లో టీకాలు వేస్తున్నారు. జడ్చర్లలో కోవిన్ యాప్ ఓపెన్ కాకపోవడంతో సమస్యలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదు చేసే క్రమంలో ఉద్యోగి కోడ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లకు సంబంధించి కొన్ని తప్పులు దొర్లాయి. మెదక్ జిల్లాలో సర్వర్‌డౌన్ సమస్యతో యాప్ ఓపెన్ కావట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment