హైదరాబాద్: ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధించడంతో పాటు ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేసుకునేలా, ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకున్న వ్యవస్థాపక దినోత్సవంపై టీఆర్‌ఎస్ తర్జనభర్జనలు పడుతోంది. గులాబీ పార్టీ గత ఏడాది ఏప్రిల్ 27 నాటికి 20వ ఏట అడుగు పెట్టింది. అయితే కోవిడ్ పరిస్థితుల మూలంగా అప్పుడు 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించని టీఆర్‌ఎస్ ఈ ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో.. భారీ హంగామాతో ప్లీనరీ నిర్వహిస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాష్టప్రభుత్వం కూడా ఈ మేరకు పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాలు, ఊరేగింపులు తదితర సామూహిక కార్యక్రమాలపై ఈ నెలాఖరు వరకు ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నెల 27న పార్టీ ‘ప్లీనరీ’నిర్వహించే విషయంలో టీఆర్‌ఎస్ తర్జనభర్జనలు పడుతోంది. ఈ నెల రెండో వారం నాటికి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.
లక్ష్యం చేరని సభ్యత్వం
గతంలో 60 లక్షల మందిని పార్టీ సభ్యులుగా నమోదు చేసిన టీఆర్‌ఎస్.. ఈసారి నియోజకవర్గానికి 50 వేల మంది చొప్పున కనీసం 80 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో కనీసం 35 శాతం మందిని క్రియాశీల సభ్యులుగా చేర్చేలా ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్.. ఫిబ్రవరి 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి పైగా సభ్యత్వం తీసుకోగా, పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ మేరకు రూ.17 కోట్ల రుసుము చేరింది.
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, పాలకుర్తి, బాల్కొండ, దుబ్బాక వంటి సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు కాగా, చాలా నియోజకవర్గాల్లో 40 వేల లోపే సభ్యత్వాలు జరిగాయి. ఫిబ్రవరి 16 నుంచి శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల సందడి ప్రారంభం కావడం, ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగకపోగా, క్రియాశీల సభ్యత్వం ఏడు లక్షల లోపే నమోదైంది. దీంతో ఫిబ్రవరితోనే ముగిసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు కొనసాగించే యోచనలో టీఆర్‌ఎస్ పార్టీ ఉంది.
పూర్తికాని సంస్థాగత కమిటీల నిర్మాణం
ఫిబ్రవరి నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి, మార్చి నెలాఖరులోగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే సభ్యత్వ నమోదు పూర్తి కాకపోగా, మండలి ఎన్నికల కారణంగా మార్చి నెలాఖరుకు కూడా సంస్థాగత కమిటీల నిర్మాణం కూడా ఎక్కడా ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉమ్మడి నల్లగొండతో పాటు ఇతర జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. దీంతో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం కోసం మరికొంత సమయం కావాలని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలు కోరినట్లు తెలిసింది. ఈ నెల 27న ప్లీనరీ నిర్వహించే పక్షంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెల మూడో వారంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ప్లీనరీ నిర్వహణపై కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment