టీకాతో తోక ముడుస్తున్న కరోనా | Coronavirus Vaccine Efficacy: Know Details Inside | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌ పని చేస్తోందోచ్‌..

Published Tue, Feb 9 2021 1:00 PM | Last Updated on Wed, Feb 10 2021 9:26 AM

Coronavirus Vaccine Efficacy: Know Details Inside - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: గత నెలలోనూ ఇజ్రాయెల్‌ను గడగడలాడించిన కరోనా వైరస్‌ ఇప్పుడు టీకా వేస్తుండటంతో తోకముడుస్తోంది. ఒకవైపు వైరస్‌ విజృంభణ ఉన్నా, శరవేగంగా కరోనా వ్యాక్సినేషన్‌తో పరిస్థితి నియంత్రణలోకి వస్తోందని, అది కరోనా టీకా వల్లే సాధ్యమైందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ ప్రభావంపై ప్రపంచంలోనే మొదటిసారిగా ఆ దేశం పరిశోధన చేసింది. ఆ అధ్యయన వివరాలతో ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికి అది పూర్తి రక్షణ ఇస్తున్నట్లు తేలిందని పేర్కొంది. ఇది తమకు ఎంతో ఊరటని వెల్లడించింది.

60 ఏళ్లు దాటిన వారిలో 50% తగ్గుదల..
ఇజ్రాయెల్‌లో జనవరి 15వ తేదీన పెద్ద ఎత్తున కరోనా విజృంభించింది. దీంతో ఆ సమయంలో లాక్‌డౌన్‌ విధించారు. అయితే అంతకుముందే అంటే డిసెంబర్‌ 20న వ్యాక్సిన్‌ మొదటి డోసు ప్రారంభమైంది. మొదటి డోసు ప్రభావం అంతగా ఉండకపోవడంతో, కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో డోసు జనవరి 10న మొదలుపెట్టారు. రెండో డోసు వేసుకున్నాక 3 వారాల తర్వాత ఈ నెల 5వ తేదీ నాటికి కేసులు గణనీయంగా తగ్గినట్లు ఇజ్రాయెల్‌ తన నివేదికలో ప్రకటించింది. జనవరి 15వ తేదీ నాటికి 60 ఏళ్ల పైబడిన వారిలో వారానికి 6 వేల కేసులు నమోదైతే, ఆ కేసుల సంఖ్య ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి 3 వేలకు పడిపోయింది.

అంటే ఆ వయసు వారిలో కేసులు సగానికి తగ్గాయని పేర్కొంది. అంతేకాదు సీరియస్‌ కేసుల సంఖ్య కూడా 33 శాతానికి తగ్గాయి. పైగా ఈ వయసు వారికి ఫిబ్రవరి 6 నాటికి 80 శాతం మందికి రెండో డోసు టీకా పూర్తి చేశారు. దీంతో ఆ వయసు గ్రూపు వారిలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆ స్థాయిలో తగ్గిపోయింది. ఇక 60 ఏళ్లలోపు వారికి కొద్దిమందికి మాత్రమే రెండో డోసు పూర్తయింది. దీంతో ఈ వయసు వారిలో జనవరి 15వ తేదీన వారానికి 6 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి ఐదు నాటికి 5 వేలకే కేసులు తగ్గాయి. ఎందుకంటే తక్కువ మందికే టీకా ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఈ వయసు గ్రూప్‌ వారిలో వైరస్‌ వ్యాప్తి తగ్గలేదని పేర్కొంది. 

21 రోజులకే పూర్తి రక్షణ..
రెండో డోసు వేసుకున్న 14 రోజులకు కరోనా నుంచి పూర్తి రక్షణ వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌ అను భవం మాత్రం మరోలా ఉంది. టీకా నుంచి పూర్తి రక్షణ 21 రోజులకు వస్తుందని అక్కడ తేలింది. అంటే పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు తయారు కావడానికి 3 వారాల సమయం పడుతుందని వెల్లడించింది. దీనికి కార ణాలను కూడా విశ్లేషించింది. అక్కడ ఇప్పటివరకు 60 ఏళ్లకు పైబడిన వారికే ఎక్కువగా టీకా వేశారు. కాబట్టి ఆ వయసు వారిలో సహజంగా శరీర స్పందన వేగం తక్కువ. రోగ నిరోధక శక్తి కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి 21 రోజులు పట్టి ఉండొచ్చని అంచనా వేసింది. పైగా కొత్త కరోనా స్ట్రెయిన్‌లు వస్తున్నాయి.

వారికి వ్యాక్సిన్‌ ఆలస్యంగా పనిచేసి ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు కొందరు వ్యాక్సిన్‌ వేసుకున్నాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో, తక్కువ సమయంలో రక్షణ కల్పించకపోవచ్చని తెలిపింది. సహజంగా ఒక్కో వ్యక్తి మీద ఒక్కో రకంగా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది. వారి రోగనిరోధక శక్తిని బట్టి ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఏది ఏమైనా కరోనా వ్యాక్సిన్‌ అందరిపైనా పనిచేస్తుంది. రెండో డోసు వేసుకున్న 21 రోజులకు కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని ఆ దేశం పేర్కొంది. ఆ దేశంలో ఫైజర్‌ టీకా వేస్తున్నారు. 16 ఏళ్లు పైబడిన వారికే వేస్తున్నారు. పైగా మొదటి రెండో డోసుల మధ్య మూడు వారాలే తేడా ఉంటోంది.

వ్యాక్సిన్‌ పనితీరు నిర్ధారణైంది..
వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇజ్రాయెల్‌ ముందంజలో ఉంది. 16 ఏళ్లు పైబడిన చాలామంది ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వాస్తవిక క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ పనిచేస్తుందని తేలింది. పైగా ప్రపంచంలోనే మొదటిసారిగా ఆ దేశం వ్యాక్సిన్‌ ప్రభావంపై అధ్యయనం చేయడం ఇతర దేశాలకు ఉపయోగకరం.. దీంతో వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యంపై ఎవరికీ భయాందోళనలు అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. వ్యాక్సిన్‌ జబ్బు, వయసుతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

ఒక్కరోజులో 101 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం 18,252 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 101 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈమేరకు సోమవారం ఆయన కరోనా బులెటిన్‌ విడుదలచేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 81,22,516 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 2,95,682 మందికి కరోనా సోకిందన్నారు. ఇక ఆదివారం 197 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,92,229 మంది కోలుకున్నట్లు తెలిపారు. ఒకరోజులో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,611 మంది మరణించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ఆక్టివ్‌ కేసులు 1,842 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 751 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాల్లేకుండా కరోనా బారినపడినవారు 2,06,977 (70%) మంది కాగా, లక్షణాలతో వైరస్‌ సోకినవారు 88,705 (30%) మంది ఉన్నట్లు వెల్లడించారు.

ట్రైనీ కానిస్టేబుళ్లకు వ్యాక్సిన్‌ 
సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. హోం గార్డులు, కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ ఆఫీసర్ల వరకు దాదాపు 60 వేల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ పోలీసులకూ వ్యాక్సిన్‌ అందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల నిర్ణయించారు. దీంతో ట్రైనీ కానిస్టేబుళ్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో 3,900 మందికిపైగా తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) ట్రైనీ కానిస్టేబుళ్లు దాదాపు 13 కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి 14 రోజుల తర్వాత సెకండ్‌ డోస్‌ ఇస్తారని సమాచారం.

చదవండి: 
ఆర్టీసీకి కోవిడ్‌ సాయం లేనట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement