అమెరికాలో పెరుగుదల.. ఇండియాలో తగ్గుదల | Coronavirus Vaccine No Side Effects Texas General Physician Interview | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌: కాసింత నొప్పులే.. కంగారేమీ లేదు

Published Thu, Jan 7 2021 10:11 AM | Last Updated on Thu, Jan 7 2021 12:38 PM

Coronavirus Vaccine No Side Effects Texas General Physician Interview - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా నుంచి మనకు మాత్రమే రక్షణ లభిస్తుందని, ఒకవేళ మన శరీరంలో వైరస్‌ ఉంటే అది ఇతరులకు సోకే ప్రమాదం పొంచే ఉం టుందని అమెరికా టెక్సాస్‌ హెల్త్‌ రిసోర్సెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ బూచిపూడి రామిరెడ్డి అంటున్నారు. కాబట్టి టీకా తీసుకున్నా సరే... వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మాస్క్‌ వాడాల్సిందేనని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే ఫైజర్‌ టీకా మొదటి డోస్‌ వేసుకున్న ఆయన, గురువారం మరో డోస్‌ వేసుకోనున్నారు. ఆయన కరోనా రోగు ల సేవలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. వ్యాక్సిన్‌తో ఎటువంటి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవనీ, అయితే దాదాపు అందరికీ కండరాల నొప్పులు ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏ వ్యాక్సిన్‌లోనైనా చిన్నచిన్న సైడ్‌ఎఫెక్ట్స్‌ సర్వసాధారణమన్నారు. వ్యాక్సినేషన్, కరోనా విస్తరణ తదితర అంశాలపై ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

కరోనా వచ్చిపోయిన 90 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌... 
కరోనా వచ్చిపోయినవారు, ప్లాస్మా తీసుకున్నవారు 90 రోజుల వరకు వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన అవసరంలేదు. ఆ తర్వాత వేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్లాస్మా తీసుకున్నవారు తప్పనిసరిగా 90 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే వారిలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి శరీరం అధికంగా స్పందించే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు, బాలింతలు నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు.  

మాస్క్‌ పెట్టుకోకుంటే ఇతరులకు వ్యాప్తి... 
వ్యాక్సిన్‌ రెండో డోసు వేసుకున్న ఏడు రోజుల తర్వాత  కరోనా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. తప్పనిసరిగా రక్షణ ఉంటుందా అంటే దానికి ఎవరూ గ్యారంటీ ఇవ్వరు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ మాస్‌్కలు తప్పనిసరిగా ధరించాలి. టీకా వేసుకున్నవారికి రక్షణ వచ్చినా, ఒకవేళ వారిలో వైరస్‌ ఉంటే ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి వైరస్‌ సోకితే, దానిపై టీకా పోరాడి వారి వరకు రక్షణ కల్పిస్తుంది. కానీ వారు తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు ఇతరులపైకి వెళితే వైరస్‌ వ్యాపిస్తుంది. పక్కనున్నవారికి వ్యాప్తి చెందకుండా ఉండటానికి, కుటుంబానికి హాని జరగకుండా మాస్క్‌ రక్షణ ఇస్తుంది. (చదవండి: అమెరికాలో రికార్డుస్థాయి మరణాలు)

వ్యాక్సిన్‌తో కండరాల నొప్పులు... 
అమెరికాలో వ్యాక్సిన్‌ వేసుకున్నవారిలో దాదాపు అందరిలో కండరాల నొప్పులు ఉంటున్నాయి. అంతకుమించి పెద్దగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు. ఒకట్రెండు చోట్ల మాత్రమే సమస్యలు తలెత్తాయి. ఏ వ్యాక్సిన్‌ వేసుకున్నా ఇలాంటివి సహజం. కంగారుపడాల్సిన పనిలేదు. వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి నుంచి రక్షణ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది. వారి శరీరతత్వాన్ని బట్టి దాని ప్రభా వం ఉంటుంది. అమెరికాలో ఆరోగ్య కార్యకర్తలు అందరూ వేసుకుంటున్నారు. సాధారణ జనాల్లోనూ వేసుకోవాలన్న భావన ఉంది. అమెరికాలో ప్రభుత్వ రంగంలో ఉచితంగా వేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్‌ కింద టీకాలు వేస్తున్నారు. డోసులు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యం ప్రకారం వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అన్ని దేశాల్లో వేయాలి. అమెరికా, యూరప్‌ వారు వేసుకొని ఇతర దేశాల వారు వేసుకోకపోతే దేశాల మధ్య ప్రయాణాల వల్ల మళ్లీ వైరస్‌ వ్యాపిస్తుంది. పల్స్‌పోలియో ఒకేసారి వేసినట్లు జరిగితేనే కరోనాను నియంత్రించవచ్చు. 

90 శాతం వ్యాక్సినేషన్‌తోనే హెర్డ్‌ ఇమ్యూనిటీ... 
అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థంగా పనిచేస్తుందని నిర్ధారించారు. యూఎస్‌ లో వ్యాక్సినేషన్‌ డిసెంబర్‌ 14న ప్రారంభమైంది. ఫైజర్‌ టీకా మూడు వారాల తర్వాత రెండో డోసు వేస్తారు. ప్రస్తుతం రెండో డోస్‌ ప్రారంభమైంది. అంతకుముందు జనాభాలో 60–70 శాతం మంది టీకా వేసుకుంటే హెర్డ్‌ ఇమ్యునిటీ వస్తుందనేవారు. ఇప్పుడు 90 శాతం వేసుకుంటేనే వస్తుందని చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ను మిస్‌కావొద్దు. అమెరికాలో టీకాలు వేసే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 45 లక్షల మందికే వేశారు. ఒకేసారి ఎక్కువమందికి వ్యాక్సిన్‌ వేస్తే వైరస్‌ చైన్‌ లింక్‌ కట్‌ అవుతుంది. నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం తదితర కారణాలతో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత 3 నుంచి 6 నెలల వరకు రక్షణ ఇస్తుంది. తర్వాత రెండోసారి వేసుకోవాలని అంటున్నారు. దీనిపై ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం జరగలేదు. 

అమెరికాలో పెరుగుదల... ఇండియాలో తగ్గుదల 
అమెరికాలో కరోనా వైరస్‌ భారీగా పెరుగు తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కేసులు మరింత పెరుగుతున్నాయి. బెడ్స్‌ లేక ఆసుపత్రుల్లో కింద పడుకోబెట్టాల్సి వస్తోంది. వృద్ధు ల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నా యి. ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య త గ్గుతోంది. భారత్‌లో సెకండ్‌ వేవ్‌ వస్తుందో లేదో తెలియదు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, ఇప్పటికే పాక్షిక హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడం వల్ల తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు.  

పాస్‌పోర్టులా పనిచేస్తుంది
వ్యాక్సిన్‌‌ వేసుకున్నాక అమెరికాలో సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ కార్డు వెంటనే ఇస్తున్నారు. ఇది ఒకరకంగా పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుంది. వ్యాక్సిన్‌ కార్డు మనతో ఉంటే దేశవిదేశాల్లో ఎక్కడికైనా సులువుగా ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మళ్లీ కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. కార్డును చూపిస్తే చాలు ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. జాగ్రత్తలతో ప్రయాణాలు చేయవచ్చు.  

దక్షిణాఫ్రికా వేరియంట్‌పై పనిచేయడం లేదు
దక్షిణాఫ్రికా వేరియంట్ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్లు పనిచేయవని అధ్యయనాలు చెబుతున్నాయి. వేరే మ్యుటేషన్‌ కారణంగా పనిచేయవని అంటున్నారు. ఇంకా దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ పెద్దగా మొదలుపెట్టలేదు. అయితే బ్రిటన్‌ కొత్త వేరియంట్‌ వైరస్‌పై మాత్రం వ్యాక్సిన్‌ పనిచేస్తుంది. బ్రిటన్‌లో ఫైజర్, ఆ్రస్టాజెనెకా టీకాలను వాడుతున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్లలో తేడాలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement