Is Covid 19 Becoming Endemic in India? Read Here - Sakshi
Sakshi News home page

కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా? 

Published Thu, Oct 21 2021 10:07 AM | Last Updated on Thu, Oct 21 2021 2:49 PM

Is Covid 19 Becoming An Endemic In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనం క్రమంగా కరోనా ‘ఎండమిక్‌ స్టేజ్‌’కు చేరుకుంటున్నట్టేనా? ఈ ప్రశ్నకు వైద్య నిపుణులు, పరిశోధకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే భారత్‌ రెండు కరోనా వేవ్‌లను ఎదుర్కోగా తక్కువ తీవ్రతతోనే థర్డ్‌వేవ్‌ కూడా రావొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో కోవిడ్‌ కేసులు పరిమితంగా కొన్ని ప్రాంతాల్లోనే వచ్చే అవకాశాలతో ‘ఎండమిక్‌ స్టేజ్‌’గా మారొచ్చునని ఎపిడమాలజిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను పూర్తిగా నిర్మూలించడమనేది సాధ్యం కాలేదు కాబట్టి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతున్నా కొన్నేళ్లపాటు మనం కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిందేనని వైద్యనిపుణులు స్పష్టంచేస్తున్నారు. 

15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!

కరోనాను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మన వైద్యవ్యవస్థకు కచ్చితమైన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఏదైనా జబ్బు లేదా వ్యాధి దాని వ్యాప్తి, నమోదయ్యే కొత్తకేసులు, భౌగోళికంగా ఏయే ప్రాంతాల్లో కేసులు విస్తరించి ఉన్నాయన్న దాని ప్రాతిపదికన వైద్యపరిభాషలో ఎండమిక్, ఎపిడమిక్, ప్యాండమిక్‌గా వివిధ కేటగిరీల కింద విభజిస్తారు. ఈ నేపథ్యంలో మన దగ్గర కోవిడ్‌ ఎండమిక్‌ దశకు చేరుకునే క్రమంలో ప్రజలకు కూడా దీని నుంచి ఎలా రక్షణ పొందాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలపై ఆయా రంగాలకు చెందిన ముగ్గురు వైద్యనిపుణులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే... 

 జాగ్రత్తలు పాటించాల్సిందే..! 
ప్రస్తుతం మన దగ్గర కరోనా కూడా నార్మల్‌గా మారిపోతోంది. టైఫాయిడ్, వైరల్‌ ఫీవర్‌ మాదిరిగానే ఈ కేసులు వస్తున్నాయి. దాదాపు రెండేళ్లుగా ప్రజలు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఎవరికైనా కోవిడ్‌ వచ్చినా కచ్చితమైన చికిత్సపద్ధతులు అంటూ ఏర్పడ్డాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. టీకా కార్యక్రమం కూడా వేగం పుంజుకోవడంతోపాటు మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ డ్రగ్‌ తదితర రూపాల్లో అద్భుతమైన ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉండటం సానుకూలాంశం. వచ్చే జనవరి చివరి దాకా పండుగలున్నందున కరోనా జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాల్సిందే.
 –డా.ప్రభుకుమార్‌ చల్లగాలి, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్‌

స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ఇలాగే.. 
ఇప్పుడు కోవిడ్‌ కేసులైతే దాదాపుగా తగ్గుముఖం పడుతున్నట్టే. ఐతే జాగ్రత్తలు తీసుకోకపోతే పెరుగుతాయి. స్థానికంగా ఎక్కడికక్కడ ఉత్సవాలు, పండుగ వేడుకల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయా ప్రాంతాల్లో కేసులు పెరిగినట్లు గతంలో నిరూపితమైంది. ఐతే కరోనా నియంత్రణకు త్వరలోనే అధునాతన ‘మోల్నూ ఫిరవిర్‌’యాంటీ వైరల్‌ మందు బిళ్లలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్‌ నిర్ధారణ కాగానే వాటితో చికిత్స ప్రారంభిస్తే సీరియస్‌ కేసుగా మారకుండా నివారించవచ్చు. వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు రెండు, మూడు వేవ్‌లుగా 3 ,4 ఏళ్లు కొనసాగాక కనుమరుగైంది. కరోనా కూడా 2, 3 ఏళ్లపాటు మనతో పాటే ఉండి క్రమంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. –డా. ఎ.నవీన్‌కుమార్‌ రెడ్డి, జనరల్‌ మెడిసిన్, డయాబెటాలజిస్ట్, నవీన్‌రెడ్డి హాస్పిటల్‌ 

డెల్టా వేరియెంటే ప్రబలం..  
ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంటే ఇప్పటికీ ప్రబలంగా ఉంది. దక్షిణాఫ్రికా లేదా మరే దేశంలోనైనా డెల్టా కొత్త వేరియెంట్‌ పుడితే అది ప్ర మాదకరంగా మారే అవకాశాలున్నా యి. భార త్‌లో వ్యాక్సినేషన్‌ పెరిగి, వివిధ రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నా, కొన్ని దేశాల్లో ఇంకా దాని తీవ్ర త తగ్గలేదు. అందువల్ల విదేశీ ప్రయాణికుల రూ పంలో ఇక్కడా మళ్లీ వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు కొట్టిపారేయలేం. అందువల్ల ఇప్పుడు మన దగ్గర కరోనా కేసులు త గ్గుముఖం పట్టినా, వచ్చే 2, 3 నెలలైతే అందరూ మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలతో ఉండాల్సిందే. కొత్త వేరియెంటేది రాకపోతే మనం మెల్లగా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టే. ఈ దశలో ఇప్పటికీ ఇంకా కరోనా చేరని ప్రాంతాల్లో కేసులొచ్చే అవకాశాలుంటాయి. 
–డా. కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రి/మెడికల్‌ కాలేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement