కరోనా లక్షణాలు.. అనుమానం ఉన్న వారు కోవిడ్ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఇక్కట్లు తప్పడంలేదు. నిన్ను ఎవరు పంపితే వచ్చావ్.. ఎవరైన నేతల సిఫారసు ఉందా.. నువ్వే స్వతహాగా వచ్చావా.. అంటూ వారిపై అక్కడి సిబ్బంది ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సిఫారసు ఉంటే నిమిషాల్లో పని పూర్తి అవుతుంది.. లేదంటే గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి ఎదురుచూడాల్సిందే. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద నెలకొన్న పరిస్థితి.
మహబూబ్‌నగర్ క్రైం: కరోనా బాధిత కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్స్‌తో పాటు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కన్పిస్తే చాలు జిల్లా జనరల్ ఆస్పత్రికి వెళ్తున్నారు. కోవిడ్ పరీక్ష కోసం నమూనాలు సేకరించాలని క్యూలైన్‌లో నిలబడుతున్నారు. కానీ అక్కడ పని చేసే వైద్య సిబ్బంది, అధికారులు మాత్రం పార్టీల నేతలు, ఇతర అధికారుల సిఫారసు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక గంటల పాటు క్యూ లైన్‌లో నిలబడిన సామాన్యుడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ రోజు ఇంత మందికే చేస్తామని తిప్పి పంపిస్తున్నారు. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చేవారు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వంద మందికిపైగా క్యూలైన్‌లో ఉంటే మరో రోజు రావాలని తిప్పి పంపుతున్నారు. చేసేదేమీ లేక వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
బులిటెన్‌పై స్పష్టత కరువు
జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులకు, క్షేత్ర స్థాయి సిబ్బందికి పరస్పర అవగాహన లోపం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య వెల్లడిలో తప్పులు దొర్లుతున్నాయి. క్షేత్రస్థాయిలో పాజిటివ్ నమోదైన రెండు రోజుల వరకు వైద్యారోగ్యశాఖ అధికారుల దృష్టికి రావడం లేదు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలతో ఆ ప్రాంతాలు తెలియక పోవడంతో ఎవరికి కరోనా వచ్చిందే లేదో తెలియక అనుమానంతో జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రైవేట్‌లో పరీక్షలు చేసుకున్న వారి వివరాలు సేకరించడంలో కొంత జాప్యం జరుగుతుంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో చేసుకుంటే ల్యాబ్ నిర్వాహకులు నేరుగా బాధితుడికి ఫోన్ చేసి చెప్పడం లేదంటే ఫోన్‌కు మెస్సెజ్ పంపి సమాచారం ఇస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సమాచారం స్థానిక మెడికల్ ఆఫీసర్‌కు తెలియడంలో అలస్యం అవుతుంది. మెడికల్ ఆఫీసర్ నుంచి జిల్లా వైద్యాధికారులకు రావడం మరింత అలస్యం అవుతుంది.
రెండు రకాల పరీక్షలు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో కరోనాకు సంబంధించి రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒకటి ఆర్‌టీపీసీఆర్ పద్దతిలో అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపడం ఒకటి. మరో పద్ధతి ర్యాపిడ్ పరీక్షలు చేసే గంట నుంచి రెండు గంటల వ్యవధిలో ఫలితాలు చెప్పడం. ప్రస్తుతం రెండో పద్ధతి అయిన ర్యాపిడ్ పరీక్షలు చేసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో ర్యాపిడ్ పరీక్షలు చేసే దగ్గర రద్దీ పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఆర్‌టీపీసీఆర్ పద్దతి ద్వారా 2557మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. అదేవిధంగా ర్యాపిడ్‌లో ఇప్పటి వరకు 1461మందికి పరీక్షలు చేస్తే వీరిలో 1096మందికి నెగిటివ్ వస్తే 365మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 923పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సీరియస్ కేసులకు ప్రాధాన్యం ఇస్తాం
జిల్లా జనరల్ ఆస్పత్రిలో తీసుకుంటున్న నమూనా సేకరణలో ఆస్పత్రి సిబ్బంది మొదటి ప్రాధాన్యత సీరియస్ ఉన్న వారికే ఇస్తున్నాం. అందరూ ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పని చేస్తున్నాం. ప్రతి రోజు ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్ పద్ధతి కింద 90మంది వరకు నమూనాలు.. ర్యాపిడ్ పద్ధతిలో 50నుంచి 60మందికి పరీక్షలు చేస్తున్నాం. ఈ క్రమంలో ఎలాంటి సిఫారసులు వచ్చినా.. ఆయాసం, దగ్గు, జలుబు ఇలా సీరియస్‌గా ఉన్న వారికి మొదట పరీక్షలు చేస్తాం. – డాక్టర్ రామకిషన్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment