పల్లెలకు పాకిన కరోనా! | Coronavirus Spreading in Mahabubnagar Villages | Sakshi
Sakshi News home page

పల్లెలకు పాకిన కరోనా!

Published Thu, May 28 2020 1:37 PM | Last Updated on Thu, May 28 2020 1:37 PM

Coronavirus Spreading in Mahabubnagar Villages - Sakshi

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో ప్రజలకు సూచనలు ఇస్తున్న అధికారులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పల్లెల్లో కరోనా కల్లోలం మొదలైంది. ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు కేవలం మున్సిపల్‌ కేంద్రాలు, పట్టణాల్లో నమోదు కాగా ప్రస్తుతం పల్లెలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు జిల్లాలు గ్రీన్‌ జోన్‌లోకి రావడంతో కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడ్డామని భావిస్తున్న తరుణంలో సుమారు 45రోజుల అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం రాంచంద్రాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు మూడు రోజుల క్రితం బయటపడింది. అలాగే రెండురోజుల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కి చెందిన 4 నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లుగా తేలింది. తాజాగా బుధవారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా ఉన్నట్లు గుర్తించడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో జనాలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడం, వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం, భౌతికదూరంపై నిర్లక్ష్యం వహించడం, బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం సేవించడం వంటి కారణాలే కరోనా రాకకు కారణం అవుతున్నాయి.

65కు చేరిన కేసులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో మొత్తం 62 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో ముగ్గురు మరణించగా, 59 మంది పూర్తిస్థాయిలో కోలుకొని వారి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం గ్రీన్‌జోన్‌లో సడలింపులతో అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈనెల 23న నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం రాచంద్రాపురంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మూడు రోజుల క్రితం మక్తల్‌ మండలం జక్లేర్‌కి చెందిన నాలుగు నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 65కు చేరింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేవలం వనపర్తిలో మాత్రమే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మహబూబ్‌నగర్‌లో 11మందికి కరోనా పాజిటివ్‌ రాగా అందరికి నయమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 48 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెల రోజులుగా రెండు జిల్లాల్లోనూ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సుమారు 50 రోజుల అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, అది కూడా గ్రామాల్లో నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నారాయణపేట జిల్లాలో ఏప్రిల్‌ 17న రెండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రాగా చనిపోయాడు. తాజాగా మక్తల్‌ మండలం జక్లేర్‌కి చెందిన నాలుగు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

పల్లెల్లో పట్టించుకోని ప్రజలు
గ్రీన్‌ జోన్‌లో ఉన్న జిల్లాలకు ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో పల్లెల్లో ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని అధికారులు, ప్రభుత్వం ఆదేశించినప్పటికి ఎవరూ పాటించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల్లో జనం గుంపులుగా తిరుగుతున్నారు. బస్సుల్లోనూ నిండుగా ప్రయాణికులు కనిపిస్తున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ప్రధానంగా పల్లెల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు దూర ప్రాంతాల నుంచి చుట్టాలు వస్తున్నారు. కచ్చితంగా అధికారుల అనుమతి తీసుకొని వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతు న్నా పల్లెల్లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పెళ్లి వేడుకలకు కేవలం 50మందికి మాత్రమే అనుమతి ఉండగా 500మందికి పైగా వస్తున్నారు. అదేవిధంగా పల్లెల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా నిర్వహిస్తుండటం, అక్కడ కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఒకే దగ్గర కూర్చొని మద్యం సేవించడం వల్ల కరోనా మహామ్మారి విస్తరణకు అవకాశం కల్పించినట్లయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గతంలో నమోదైన రెండు కేసులు మున్సిపల్‌ కేంద్రాల్లో ఉండగా ప్రస్తుతం పల్లెలకు పాకడంతో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అలజడి మొదలైంది.  

కొండారెడ్డిపల్లిలో అధికారుల పర్యటన.. 
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఓ వృద్ధుడికి పాజిటివ్‌ రావడంతో అధికారులు బు«ధవారం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్, డీపీఓ సురేష్‌ మోహన్, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు గ్రామంలో చేపట్టనున్న కరోనా నివారణ చర్యలను గ్రామస్తులకు వివరించారు. 14 మందిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించారు. గ్రామంలో నాలుగు వైద్య బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి తరలించారు. పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తి పెళ్లి వేడుకల్లో పాల్గొన్న నేపథ్యంలో ఆ వ్యక్తికి ఎవరి నుంచి సోకింది. ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement