'పెబ్బేరు' ఉలికిపాటు.. | First Coronavirus Positive Case File in Wanaparthy | Sakshi
Sakshi News home page

'పెబ్బేరు' ఉలికిపాటు..

Published Mon, Jun 1 2020 11:10 AM | Last Updated on Mon, Jun 1 2020 11:10 AM

First Coronavirus Positive Case File in Wanaparthy - Sakshi

వనపర్తి:  ఇప్పటివరకు గ్రీన్‌జోన్‌లో ఉన్న వనపర్తి జిల్లాకు శనివారం కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి జిల్లాకు రావటంతో జిల్లాలో కరోనా కలకలం నెలకొంది. కొంత సమయం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలోనే సంచరించాడని తెలియగానే.. పెబ్బేరు మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉలికిపడ్డారు. గత దశాబ్దకాలంగా హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న పెబ్బేరు మండలం పాత సూగూరుకు చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా సొంత గ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేసేందుకు శ్యాంపిల్స్‌ ఇచ్చి కుటుంబ సభ్యులను చూడటానికి స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడి చేరుకున్న కొద్ది సమయానికే టెస్టుల ఫలితాల్లో పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనకే ఫొన్‌లో సమాచారం ఇచ్చారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సదరు వ్యక్తి సహకరించకపోవటంతో రాష్ట్రస్థాయి నుంచి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు.  

అతని కోసం అధికారులగాలింపు ప్రారంభమైంది  
విషయం ఆ నోటా ఈ నోటా బయటకు రావటంతో జిల్లా వ్యాప్తంగా అంశం చర్చనీయాంశంగా మారింది. అ«ధికారులు హుటాహుటిన సూగురు గ్రామానికి చేరుకుని కరోనాపాజిటివ్‌ ఉన్న వ్యక్తి హైదరాబాద్‌ నుంచి ఎలా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి తిరిగాడు. ఎవరెవరిని కలిశాడనే కోరణంలో విచారణ ప్రారంభించారు. అతని, సమీప బంధువుల మూడు కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు.  

ఒక్కడితో వనమంతా చెడినట్లుగా..
ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాను హైదరాబాద్‌లో నివాసం ఉండే వ్యక్తి కరోనా వైరస్‌తో జిల్లాకు రావటంతో ఒక్కడితో వనమంతా చెడినట్టు అన్న చందంగా మారింది. సదరు వ్యక్తి హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులో పెబ్బేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన బాబాయ్‌ మోటార్‌ సైకిల్‌పై స్వగ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. పెబ్బేరులో ఓప్రైవేటు ఆర్‌ఎంపీని కలిసి నొప్పుల మందులు వాటడంతో పాటు కొన్ని టెస్టులు చేయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. పెబ్బేరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అక్కడి వైద్యురాలు లక్షణాలను గుర్తించి క్వారంటైన్‌లో ఉండాలని సూచించినా నిర్లక్ష్యంగా పెబ్బేరులో కలియతిరగటం, గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులను కలవటంతో ఎంత మందికి వైరస్‌ సోకుతుందోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  

జిల్లా నివాసి కాదంటూ ప్రకటన
కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పదకొండేళ్లుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తూ.. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడని, తల్లిదండ్రులను చూసి వెళ్లేందుకు వచ్చారని, కరోనా పాజిటివ్‌ ఉందని తెలియగానే తిరిగి హైదరాబాద్‌ వెళ్లాడని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.  

ఎవరెవరిని కలిశాడు..  
కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి బస్‌లో పెబ్బేరు వరకు వచ్చాడు. అక్కడే ఓ ఆర్‌ఎంపీని, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ను కలిశాడు. ఇంకా కొంతమందిని కలిసినట్లు తెలుస్తోంది. వారందినీ జిల్లా అధికారులు విచారించలేదు. కేవలం అతను స్వగ్రామంలో కుటుంబ సభ్యులను మరికొందరిని మాత్రమే క్వారంటైన్‌లో ఉంచారు. పెబ్బేరులో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కలిసి వాళ్లను ఎందుకు విచారణ చేయటంలేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.    

జిల్లాలో తొలి కేసు  
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నిల్‌ అని హెల్త్‌ బులిటెన్‌లో చూపించారు. కానీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, ఫ్యామి లీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వనపర్తి జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన ట్లు శనివారం సాయంత్రమే హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement