సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది బాధితులు చెప్పే మాట. ఇంతకాలం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో జ్వర తీవ్రతతో వచ్చినవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. అయితే ఇకపై జ్వరం ప్రధాన లక్షణం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో నిపుణుల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. రెండు డోసుల టీకా పొందిన వారికి వైరస్ సోకితే టీకా రక్షణ కారణంగా జ్వరం ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే వైరస్ మార్పు చెందుతుండటం కూడా మరో కారణమని అభిప్రాయపడుతున్నారు.
‘సెకండ్ వేవ్ వరకు కరోనా లక్షణాలు తీవ్రంగానే కన్పించాయి. ఎక్కువ మందిలో 103 డిగ్రీల వరకు జ్వరం వచ్చేది. తక్కువ మందిలో మాత్రమే జ్వరం లేకపోవటం గుర్తించాం. కానీ కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల్లో జ్వరం ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఉష్ణోగ్రత (మైల్డ్ ఫీవర్) నమోదవుతోంది. ఇకపై జ్వరంతో సంబంధం లేకుండా ఎలాంటి లక్షణం ఉన్నా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందే. థర్డ్ వేవ్ ప్రమాదకరంగా మారొద్దంటే ఈ అప్రమత్తత చాలా అవసరం’అని హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస పేర్కొన్నారు. ఇకపై ఎక్కువగా జలుబు, గొంతులో గరగర (ఇరిటేషన్), ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, ఒళ్లు నొప్పులు కరోనా లక్షణాలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గొంతు, ముక్కులోంచి సేకరించే నమూనాల్లో వైరస్ దొరక్కపోవచ్చని డాక్టర్ సునీల్ పేర్కొంటున్నారు.
రక్త పరీక్ష ద్వారా కొంత స్పష్టత..: ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. కోవిడ్ లక్షణాలు ఉంటే రక్త పరీక్ష (సీబీపీ) చేయించుకోవటం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాల్లో ఉండే న్యూట్రోఫిల్ కౌంట్ మరీ ఎక్కువగా ఉన్నా, లింఫోసైట్స్ తక్కువగా ఉన్నా కోవిడ్ సోకి ఉంటుందనే భావించొచ్చని చెబుతున్నారు. వచ్చే 4 నెలలు నిత్యం ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలో ఏమాత్రం తేడా ఉన్నా ఎలాంటి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాల్సి ఉంటుంది.
యాంటీ హిస్టమిన్స్ మేలు..
వైరస్ సోకిందన్న అనుమానం ఉండి మందులు వేసుకోవాల్సి వస్తే (వైద్యులను సంప్రదించే వీలు లేకుంటే) యాంటీ హిస్టమిన్స్ (హెచ్1హెచ్2) మందులు వాడొచ్చని డాక్టర్ సునీల్ వాస పేర్కొన్నారు. ఇవి న్యుమోనియాకు గురికానివ్వవని, ఇతర శరీరభాగాలకు సోకకుండా చూస్తాయని చెప్పారు.
చిన్నారులకు వస్తుందన్న భయం వద్దు..
వచ్చే నాలుగైదు నెలల పాటు అందరూ సమతుల ఆహారం తీసుకోవాలి. లాక్టోబాసిల్లై ఉండే పెరుగుతో పాటు సల్ఫరోఫేన్ అధికంగా ఉండే బ్రకోలీ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయలు తినాలని డాక్టర్ సునీల్ స్పష్టం చేశారు. ఇక థర్డ్‌వేవ్‌లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుందన్న భయాన్ని వీడాలని సూచించారు. వారికి ప్రత్యేకంగా కోవిడ్ టీకాలు వేయించాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద వయసు వారు వచ్చే నాలుగైదు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment