శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం అంతా ఆమె కల్పితమాటలేనని రాచకొండ పోలీసులకు దొరికిన శాస్త్రీయ ఆధారా లతో రుజువైంది. ఈ కేసులో ఆమే సూత్రధారి.. ఆమే పాత్రధారిగా పోలీసులు తేల్చారు. తొలుత భావించినట్లుగా ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం కూడా జరగలేదని సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు తేల్చేశాయి. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు డ్రామా ఆడిన విద్యార్థిని కేసు వివరాలను అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తితో కలసి నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్ శనివారం మీడియాకు తెలిపారు.
అసలేం జరిగిందంటే...
మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్‌ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్‌వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు.
వంద మంది పోలీసులు...
తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్‌కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్‌కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. చదవండి: (బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం)
దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు.
10వ తేదీన ఏఏ సమయాల్లో ఎక్కడుందంటే...
♦సాయంత్రం 5.30: రాంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి ఆటోలో ప్రయాణం
♦సాయంత్రం 5.57: యామ్నాంపేట టీస్టాల్ ముందు ఆటో దిగింది
♦సాయంత్రం 6.03: ఒంటరిగా నడుచుకుంటూ తల్లికి ఫోన్‌కాల్ చేసింది.
♦సాయంత్రం 6.15: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీవైపు వెళ్లింది.
♦సాయంత్రం 6.44: కొండాపూర్ రైల్వే గేట్
♦సాయంత్రం 6.48: ఘట్‌కేసర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు
♦సాయంత్రం 6.58: సాయి లేడీస్ హాస్టల్
♦సాయంత్రం 6.59: ఘట్‌కేసర్ ఓల్డ్ విలేజ్
♦రాత్రి 7.05: కల్కి ఆసుపత్రి ముందు ఆటో ఎక్కింది
♦రాత్రి 7.23: ఎన్‌టీపీసీ ఎక్స్‌రోడ్డు, అన్నోజిగూడలో దిగింది. అక్కడి నుంచి 150 మీటర్ల దూరంలోనే ఆమె ఆచూకీ పోలీసులకు దొరికింది.
Comments
Please login to add a commentAdd a comment