సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. అందుకే వాళ్లు తీవ్రవాదులతో సమానం. తాగి వాహనం నడుపుతూ సోమవారం ఒక్కరోజే 420 మంది పట్టుబడ్డారు. వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులనూ భాగస్వామ్యం చేస్తాం’ అని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీ వ్యాఖ్యానించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సజ్జనార్ మంగళవారం విడుదల చేసి, విజన్ 2021ను ప్రకటించారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట, సీసీటీవీ కెమెరాల పెంపు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
మరో మూడు ఠాణాల్లో ‘డయల్ 100 డొమెస్టిక్’
‘గృహ హింస ఫిర్యాదులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే జగద్గిరిగుట్ట, మియాపూర్, రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లలో ‘డయల్ 100 డొమెస్టిక్ వయొలెన్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టీమ్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటివల్ల సత్ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల ఠాణాల్లోనూ ఈ సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సజ్జనార్ వివరించారు.
సీపీ చెప్పిన మరికొన్ని వివరాలు
►రహదారిపై ఏ చిన్న వాహనం వెళ్లి పెద్ద వాహనాన్ని ఢీకొట్టినా పెద్ద వాహనదారుడిపైనా కేసు నమోదు చేస్తున్నారు. దీనికి స్వస్తి పలికి ఎవరు ప్రమాదం చేస్తారో వారిపైన ఎఫ్‌ఐఆర్ నమోదును 2021లో పకడ్బందీగా అమలు చేస్తాం.
►జీవో నంబర్ 167 ప్రకారం సైబరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచుతాం. ఈ ఏడాది 1,23,000 సీసీ కెమెరాలు బిగించాం. 2021లో దీనికి రెట్టింపు అమరుస్తాం. ►నగరంలోని రహదారులపై వెళ్లే వాహనాలను సీసీటీవీ కెమెరాల ద్వారా సైబరాబాద్‌లోని భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించవచ్చు. ఫలితంగా ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పడతాం. నేరం జరిగితే నేరగాళ్లనూ పట్టుకుంటాం. ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే క్లియర్ చేసేలా సూచనలు ఇస్తాం. వచ్చే ఏడాదిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను కీలకంగా వినియోగించుకుంటాం.
►సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. జనాల్లో అవగాహన కలిగించేందుకు ఎస్‌సీఎస్‌సీ సహకారంతో సైబర్ మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తాం. అలాగే కొంత మంది పోలీసు సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై ఎఫ్‌ఐఆర్ నుంచి నిందితుడికి శిక్ష పడేలా చేసేంత వరకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇచ్చాం. వాళ్లు వచ్చే ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తారు. సైబర్ నేరాల కట్టడికి ఏం చేయాలనే దానిపై త్వరలోనే డీజీపీతో సమావేశమవుతాం.
Comments
Please login to add a commentAdd a comment