
ఖమ్మం మయూరిసెంటర్: రామానుజాచార్యులు సమతా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ పాలన ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రామానుజుల వారు అసమానతల నిర్మూలన కోసం పాటుపడితే బీజేపీ ప్రభుత్వం ఆ అసమానతలను పెంపొందిస్తోందన్నారు. ప్రధాని మోదీ శ్రీరాముడి తరహాలో పరిపాలిస్తున్నారని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో విలేకరులతో మాట్లాడుతూ స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నందుకా? మనువాదం, మతోన్మాదాలను ప్రోత్సహిస్తున్నందుకా? కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నందుకా? ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నందుకా? ఏ విషయంలో శ్రీరామరాజ్యంతో పోల్చారని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరిస్తున్నారని, గోడకు చెప్పినా, మోదీకి చెప్పినా ఒక్కటేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదని సమర్థించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ తెచ్చిన వాదన సరికాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, టేకులపల్లి మండలాల్లో పోడు రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆ మండలాల్లో బాధితులను కలుస్తామన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.