వనజీవి రామయ్య దంపతులను సన్మానిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో విజయశాంతి తదితరులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాజకీయాలకతీతంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవాలను నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. మన భాషలు వేరైనా అంతా భారతీయులుగా ఉన్నామని, భిన్నత్వంలో ఏకత్వం చాటేందుకే సంస్కృతీ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సంస్కృతీ మహోత్సవాల ముగింపు సమావేశం బుధవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళా ప్రదర్శనలను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 21 జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రామప్పను అభివృద్ధి చేసే పనులు రెండు మూడు మాసాల్లో ప్రారంభిస్తామని చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్, మంత్రులకు ఆహ్వానం పంపిస్తామని, అందరూ హాజరవుతారని తెలిపారు. మాజీ ఎంపీ, సాంస్కృతిక రాయబారి విజయశాంతి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కోరారు. సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘ఒసేయ్ రాములమ్మ’లోని పాట పాడి విజయశాంతిని సినిమాలోని డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘దొరా.. నీ కాళ్లు మొక్కం.. తల దించుకోం..’అని చెప్పడంతో, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి డైలాగ్ చెప్పినట్లుందంటూ చప్పట్లు కొట్టారు.
ఘల్లుమన్న ఓరుగల్లు: రాగం, తాళం, గానం, నృత్యంతో ఓరుగల్లు ఘల్లుమంది. సంస్కృతీ మహోత్సవ్‌లో భాగంగా దేశప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, వేషధారణలు ప్రతిబింబించేలా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవానికి బుధవారం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment