సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా కేవలం ఫోన్ ద్వారానే కథ నడుపుతూ అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో తయారైన నాటు, నీటు తుపాకులను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ కేంద్రంగా ప్రచారం చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
తుపాకీకి డబ్బు ఇప్పుడు చెల్లించాల్సిన పనిలేదని, కేవలం రూ.520 అడ్వాన్స్‌గా చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. ఇందులో బాధితులు కోల్పోతున్నది చిన్న మొత్తాలే కావడంతో ఎవరూ పోలీసుల వరకు వెళ్లి ఫిర్యాదులు చేయడం లేదు. దీన్నే అదనుగా భావిస్తున్న అనేక ముఠాలు ఈ తరహా నేరాలకు పాల్పడి అనునిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నాయి.
తుపాకుల ప్రచారంపై ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన పోస్ట్. (ఇన్‌సెట్‌లో) వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటో
వీడియో రూపంలో ప్రకటన..
ఫేస్‌బుక్‌లో ఆల్ ఇండియా డెలివరీ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసిన సైబర్ నేరగాళ్లు అందులో తుపాకులు, తపంచాలు, కత్తులకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ పేజ్ పైనే 86384 67582 అనే మొబైల్ నంబర్ కూడా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తామంటూ ఓ లింకును పెడుతున్నారు.
ఈ ప్రకటనకు ఆకర్షితులైన వాళ్లు ఈ లింక్ క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్‌కు వెళ్తోంది. ఫేస్‌బుక్ పేజ్ పైన ఉన్న నంబర్‌తోనే పని చేసే ఈ వాట్సాప్ ఖాతాకు డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)గా ఆయుధాలను పక్కన పెట్టుకుని పడుకున్న యువకుడి ఫొటో ఉంటోంది. ఫేస్‌బుక్ ద్వారా ఈ వాట్సాప్ ఓపెన్ కావడంతోనే తెరిచిన వ్యక్తి ఆ ఆయుధాల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సందేశం సైతం పోస్టు అవుతోంది.
రకరకాల ఫొటోలు షేర్ చేసి..
ఆ వెంటనే స్పందిస్తున్న సైబర్ నేరగాళ్లు వివిధ రకాల తుపాకులకు సంబంధించిన 20–30 ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడానికి ఈ ఫొటోలు కూడా ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసినట్లు ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. చేత్తో పట్టుకుని, వాహనాలపై ఉంచి, వస్త్రాల్లో భద్రంగా కట్టి ఉంచిన తుపాకుల ఫొటోలనే షేర్ చేస్తున్నారు.
వీటిని చూసిన వాళ్లు అవతలి వారి దగ్గరే అవి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవతలి వ్యక్తి వాటి ఖరీదు చెప్పమంటూ ఆరా తీస్తే... తొలుత ఓ తుపాకీ ఎంచుకుని దాన్ని తనకు రిటర్న్ షేర్ చేయమంటూ సైబర్ నేరగాడు సూచిస్తున్నాడు. అలా చేసిన తరువాత ఆ తుపాకీ ధరను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య చెప్పి, ఎక్కడకు కావాలంటే అక్కడకు తెచ్చి ఇస్తామంటున్నాడు.
పరీక్షించడం కోసమూ చెల్లింపులు..
తమ వద్ద ఏ తుపాకీ ఖరీదు చేసినా దాంతో పాటు పది తూటాలు ఉచితంగా ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఆయుధానికి పూర్తి మొత్తం ముందుగా చెల్లించాల్సిన పనిలేదని, అడ్వాన్స్‌గా కేవలం రూ.520 చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. తుపాకులపై ఆసక్తి ఉన్న వాళ్లు, తక్కువ ధరకు వస్తోందని భావించిన వారిలో కొందరు ఇది నిజమా? కాదా? అనేది తెలుసుకోవడానికి చెల్లింపులు చేస్తున్నారు.
ఈ అడ్వాన్స్‌ను 89509 45896 నంబర్‌కు వాట్సాప్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. ఆ మొత్తం పంపే వరకు సందేశాలు పంపుతూనే ఉంటున్నారు. ఒకసారి తన ఖాతాలో ఆ డబ్బు పడిన తర్వాత బాధితుల నంబర్లను బ్లాక్ చేయడం, వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఎత్తకపోవడం వంటివి చేస్తున్నారు. తాము కోల్పోయింది చిన్న మొత్తమే అనే భావనతో బాధితులూ ఫిర్యాదులు చేయట్లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.
ఇది మోసం కాకపోయినా నేరమే..
ఇలాంటి మోసాల్లో ఒక బాధితుడు కోల్పోయేది తక్కువే అయినా... వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో నేరగాళ్లకు చేరేది రూ.లక్షల్లోనే ఉంటుంది. ఈ తరహా నేరాల్లో నేరగాళ్లు వినియోగిస్తున్న ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు బోగస్ వివరాలతో లింకై ఉంటాయి. అందువల్ల వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం.
అయితే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయించడం ద్వారా వారిని కొంతవరకు కట్టడి చేయొచ్చు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల ఉచ్చులో ఎవరూ పడకూడదు. ఇది మోసం కాకుండా నిజంగా ఆయుధాలు డెలివరీ అయినా అదీ నేరమే అవుతుంది. లైసెన్సు లేకుండా ఎవరూ ఎలాంటి ఆ«యుధాలూ కలిగి ఉండరాదు.
– డి.ప్రభాకర్ నాయుడు, సైబర్ క్రైమ్ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment