సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఓ మార్గమని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) సాయం తీసుకుంటున్నారు. ఒకే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలతో తెరిచిన అన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు.
►∙వివిధ రకాల పేర్లతో ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అత్యంత కీలకం. వీళ్లు నేరుగా ఎవరికీ కనిపించని నేపథ్యంలో ఏదైనా మోసంలో ప్రజల నుంచి డబ్బు దండుకోవడానికి వీటిని, వీటికి లింకై ఉన్న యాప్స్‌ను వినియోగిస్తుంటారు.
►ఈ నేరగాళ్లు నేరుగా తమ పేరుతో బ్యాంకు ఖాతాలు తెరవరు. అలా చేస్తే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో పక్కా ఆధారాలు లభిస్తాయని, వాటి ఆధారంగా తాము కూడా పట్టుబడతామని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కమీషన్ తీసుకుని తమ గుర్తింపు పత్రాలతో ఓపెన్ చేసి అందించే వారిని ఎంచుకుంటారు.
►బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలో కచ్చితంగా కొన్ని కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి బ్యాంకు ఖాతాలను అందించే వాళ్లు తమ కేవైసీలతో అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు ఇస్తుంటారు. వీటిలోనే సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి డబ్బు డిపాజిట్, ట్రాన్స్‌ఫర్ చేయిస్తారు.
►ఏదైనా ఒక బ్యాంకు ఖాతాలో డబ్బు పడిన తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని వివిధ ఖాతాల్లోకి బదిలీ చేసేస్తుంటారు. ఒక్కో బాధితుడికి ఒక్కో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి వాటిలో డబ్బు పడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరోపక్క బాధితులు ఫిర్యాదు చేసినా వీటి వివరాలు సంగ్రహించే లోపు నగదు మరోచోటకు వెళ్లిపోతుంది.
►మరోపక్క ఓ కేవైసీతో ఎక్కడెక్కడ, ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచారు అనేది ఆయా బ్యాంకులకు తెలిసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు వరుసపెట్టి నేరాలు చేసుకుంటూపోతున్నా కేవలం ఫిర్యాదుదారుడు డబ్బు వేసిన వాటిని మాత్రమే ఫ్రీజ్ చేయడం సాధ్యమవుతోంది.
►ఈ విషయాన్ని గమనించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కో కేవైసీతో ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచి ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? లావాదేవీలు ఏంటి? తదితర వివరాలన్నీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఎఫ్‌ఐయూ వద్ద అందుబాటులో ఉంటాయని గుర్తించారు. కీలక సైబర్ నేరాల విషయంలో ఆ బాధితుల డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో వాటిని కేవైసీ వివరాలు సంగ్రహిస్తున్నారు. వీటిని ఎఫ్‌ఐయూకు పంపడం ద్వారా వాటితో తెరిచిన ఇతర ఖాతాలను తెలుసుకుంటున్నారు. అవి కూడా సైబర్ నేరాలకే వినియోగిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయితే అసలు ఖాతాతో పాటు వీటినీ ఫ్రీజ్ చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment