
చివ్వెంల(సూర్యాపేట) : మానవత్వం మంటగలిసింది. ఒక్కగానొక్క కుమార్తె ఆస్తినంతా కాజేసి తండ్రి చనిపోగా అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించింది. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. సూర్యాపేట పట్టణానికి చెందిన తోట మల్లయ్య (75), జయమ్మ దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె పెళ్లి వైభవంగా చేశారు. కాగా కూతురు ఆమె భర్త ఆ వృద్ధ దంపతులను తామే చూసుకుంటామని చెప్పి గత సంవత్సరం డిసెంబర్ 29న వారి వద్ద ఉన్న రూ.4 లక్షలు బ్యాంకులో డ్రా చేయించి తీసుకెళ్లారు.
కాగా మల్లయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సూర్యాపేట పట్టణంలోని తన ఇంట్లో మృతి చెందాడు. ఈ విషయాన్ని కూతురుకు తెలియజేయగా తనకు ఎలాంటి సంబంధంలేదని సమాధానం ఇచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక భర్త మృతదేహాన్ని కూతురు నివాసం ఉండే చివ్వెంల మండలం బీబీగూడెం తీసుకెళ్లింది. కూతురు ఇంటి ఎదుట భర్త మృతదేహాన్ని ఉంచి బుధవారం రాత్రంతా రోదిస్తూ వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానికంగా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు గ్రామానికి వెళ్లి కూతురు, అల్లుడికి కౌన్సెలింగ్ నిర్వహించి అంత్యక్రియలు జరిగేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment