సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి.. రెండు మృతదేహాలను గుర్తించారు. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో.. డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత బిల్డింగ్ వెనక రెండు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఘోర ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ కూల్చివేతపై అనుభవం కలిగిన ఏజెన్సీని జీహెచ్‌ఎంసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే కూల్చివేత విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా.. బిల్డింగ్ ఫైల్ విషయంలో ఇవాళ పెద్ద హైడ్రామానే నడిచింది.
డెక్కన్ మాల్ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్ విషయంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘ ఫైల్ మా దగ్గర లేదంటే మా దగ్గర లేద’ని అధికారులు వాదులాడుకున్నారు. అయితే.. ఈ అక్రమ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ వర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్ దొరికితేనే.. కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
మరోవైపు ఫైల్‌తో సంబంధం లేకుండా.. భవన కూల్చివేతకు సంబంధించి ఒక స్కెచ్ జీహెచ్‌ఎంసీ అధికారులు తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి.. కూల్చివేతపై ఇవాళే ఓ స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు.
ఇక.. బిల్డింగ్ కూల్చివేతపై నగరానికే చెందిన మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బిల్డింగ్ కూల్చడం, వ్యర్థాల తొలగింపు అంశాలను పరిశీలించారు ఇంజినీర్లు. బిల్డింగ్ హైట్, ఆకారం, లోపల గదుల ఆధారంగా డిమాలిషన్ చేయడానికి ప్లానింగ్ రూపొందిస్తున్నారు. పరిస్థితులను బట్టి మూడు, నాలుగు రోజుల్లో కూల్చడం పూర్తవుతుందని ఏజెన్సీ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే.. కూల్చివేతతో చుట్టుపక్కల భవనాల పరిస్థితిపై ఈ ఉదయం ఆందోళన వ్యక్తం కాగా.. జీహెచ్‌ఎంసీ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment