సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాల రేటు తగ్గింది. పరీక్షలు, చికిత్సలు విస్తృతం కావడంతో కోవిడ్ మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గత నెల 18వ తేదీన కరోనా కేసుల్లో మరణాల శాతం 0.93 శాతం ఉండగా, అది ఆ నెలాఖరుకు 0.82 శాతానికి తగ్గింది. ఈ నెల 1న మరణాల రేటు 0.81 శాతం ఉండగా, ఏడో తేదీ నాటికి 0.79 శాతానికి తగ్గింది. ఇక బుధవారం ఉదయం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం మంగళవారం నాటికి కరోనా మరణాల శాతం 0.75 శాతానికి తగ్గినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో రికవరీ రేటు కూడా పెరిగిందని ఆయన తెలిపారు. గత నెల 18న కరోనా కేసుల్లో రికవరీ రేటు 70 శాతముంటే, ఆ నెలాఖరుకు 72.3 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఈ నెల 18న 77.31 శాతానికి రికవరీ రేటు పెరిగినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. జాతీయస్థాయిలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.92 శాతం ఉండగా, మన రాష్ట్రంలో అది సగానికి పైగా తగ్గడం గమనార్హం.
పరీక్షలు, చికిత్సల వికేంద్రీకరణ..
నెల క్రితం కేవలం హైదరాబాద్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు జరిగేవి. మొదట్లో ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల, ప్రైవేట్‌ల్లో 23 చోట్ల జరిగేవి. ఆ తర్వాత ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను పీహెచ్‌సీ స్థాయి వరకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,076 కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు జరుగుతున్నాయి. పైగా అరగంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రస్తుతం 24 వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక జిల్లాల్లోనే కరోనా రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం తో మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టెస్ట్‌ల కోసం, చికిత్సల కోసం వేచి చూసే ధోరణి పోయింది. కిందిస్థాయిలోనూ ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెరిగింది. వైద్యుల్లోనూ గందరగోళం పోయింది. దీంతో ఏమాత్రం జ్వరం వచ్చినా జనం అప్రమత్తం అవుతున్నారు. డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అవసరమైతే తక్షణ వైద్యం కోసం పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. వెంటనే స్పందించని వారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. లేకుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు.
ఒక్కరోజులో 1,763 కేసులు..
రాష్ట్రంలో మంగళవారం 24,542 టెస్టులు చేయగా, 1,763 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,97,470 పరీక్షలు నిర్వహించగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95,700కి చేరింది. తాజాగా మరో 8 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 719కి చేరింది. కొత్తగా 1,789 మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 20,990 ఉన్నాయి. అందులో 14,461 మంది ఇళ్లల్లో లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 484 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 169, రంగారెడ్డి జిల్లాలో 166 నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. తక్కువగా నారాయణపేట, కొమురంభీం జిల్లాల్లో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.
తగ్గుతున్న కరోనా మరణాల రేటు
Published Thu, Aug 20 2020 5:56 AM | Last Updated on Thu, Aug 20 2020 5:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment