కవిత అసలైన పెట్టుబడిదారు! | Delhi liquor policy case ED allegation chargesheet On MLC Kavitha | Sakshi
Sakshi News home page

కవిత అసలైన పెట్టుబడిదారు!

Published Wed, May 31 2023 1:49 AM | Last Updated on Wed, May 31 2023 6:57 AM

Delhi liquor policy case ED allegation chargesheet On MLC Kavitha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌ల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది. సౌత్‌ గ్రూప్‌ (శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు)తో కలిసి మనీశ్‌ సిసోడియా, ఇతర ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్‌ ఈ కుట్ర చేశారని వివరించింది.

లిక్కర్‌ విధానం కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాపై ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంకే నాగ్‌పాల్‌ మంగళవారం పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జూన్‌ 1వ తేదీకి  వాయిదా వేశారు. 278 పేజీల ఈ అనుబంధ చార్జిషీటులో ఈడీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరును 53 సార్లు ప్రస్తావించింది. 

ఈడీ అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలివీ.. 
► ఈ కేసుకు సంబంధించి 2022 నవంబర్‌ 11, 20 తేదీలతోపాటు 2023 ఫిబ్రవరి 16, మార్చి 6వ తేదీల్లో జరిగిన కార్యకలాపాల్లో కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్‌ (ఎల్‌1) భాగస్వామి అరుణ్‌ పిళ్‌లై పాల్గొన్నారు. 

► 2022 ఏప్రిల్‌ 8న ఢిల్లీలోని ఒబెరాయ్‌ మైడెన్స్‌లో విజయ్‌నాయర్, దినేశ్‌ అరోరాలతో కవిత, అరుణ్‌ పిళ్‌లై సమావేశమై సౌత్‌గ్రూపునకు కిక్‌ బ్యాక్‌ల రూపంలో చెల్లింపులపై చర్చించారు. 

► కవిత తరఫున పనిచేస్తున్న వారికి కిక్‌బ్యాక్‌ల సొమ్ము చెల్లింపుకోసం ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంల తరఫున విజయ్‌నాయర్‌ పాలసీలో అనుకూలంగా మార్పులు చేశారని బుచ్చిబాబు వాంగ్మూలంలో వెల్లడించారు. 

► మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలోకి మాగుంట రాకను ఢిల్లీ సీఎం స్వాగతించారు. 

► కవిత ప్రతినిధిగా అరుణ్‌ పిళ్‌లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రతినిధిగా మేరకు ప్రేమ్‌ ఇండోస్పిరిట్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దీనిలో 65 శాతం వాటా గురించి మాత్రం అరుణ్‌ పిళ్‌లైతోనే చర్చించానని, తానెప్పుడూ ప్రేమ్‌ను కలవలేదని సమీర్‌ మహేంద్రు వాంగ్మూలం ఇచ్చారు. 

► అరుణ్‌ పిళ్లై, ఇతరులు కూడా ఇందులో అసలు పెట్టుబడిదారులు రాజకీయ సంబంధాలున్న కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్‌రెడ్డి అని పలు సందర్భాల్లో వెల్లడించారు. 

► సమీర్‌ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్‌కు అరుణ్‌ పిళ్‌లై వెల్లడించారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందంటూ కవిత ఫేస్‌టైం యాప్‌లో సమీర్‌కు చెప్పారు. ఎల్‌1 దరఖాస్తు విషయంలో ఏవైనా ఇబ్బందులొస్తే ఏ సాయం కావాలన్నా అరుణ్‌ పిళ్‌లై ద్వారా తెలియజేయాలని సూచించారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్‌ మహేంద్రు, శరత్, అరుణ్‌ పిళ్‌లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌పిళ్‌లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్స్‌ ఎల్‌1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు. 

► ఢిల్లీలోని గౌరి అపార్ట్‌మెంట్స్‌లో భేటీ సందర్భంగా అర్జున్‌ పాండే, అరుణ్‌ పిళ్‌లై, బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లిలను విజయ్‌నాయర్‌ తనకు పరిచయం చేశారని.. వారు ఎంఎస్‌ రెడ్డి, కవితలకు బాగా దగ్గరవారని, మద్యం వ్యాపారంలో సాయం చేస్తారని చెప్పారని.. దినేష్‌ అరోరా ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు.  

► దినేష్‌ అరోరా కవితతో రెండుసార్లు సమావేశమయ్యారు. ఒబెరాయ్‌లో సమావేశం సందర్భంగా అడ్వాన్స్‌ కిక్‌బ్యాక్స్‌ను విజయ్‌నాయర్‌కు చెల్లించడంపై చర్చించారు.  

► రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్‌లో వాటా ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్‌ నేతలకు మధ్య అవగాహన/ఒప్పందం ఉందని అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ మేరకే తాను కవితకు ప్రాతినిధ్యం వహించానని, అవసరమైన పెట్టుబడి ఇస్తూ కాగితాలపై భాగస్వామి అయ్యారని తెలిపారు. తాను చాలా కాలంగా కవితకు స్నేహితుడినని పేర్కొన్నారు. 
 
పాలసీని అనుకూలంగా రూపొందించేలా.. 
ఢిలలిక్కర్‌ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేలా.. ఇందుకోసం ఆప్‌కు నిధులు సమకూర్చుకునేలా కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా బుచ్చిబాబు తన వాంగ్మూలంలో వెల్లడించారని చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. ‘‘మార్చి 2021లో బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్‌లై, అభిషేక్‌ బోయినపల్లి తదితరులు విజయ్‌నాయర్, సమీర్‌ మహేంద్రులతో జూమ్‌లో సమావేశమై.. ఢిల్లీ మద్యం విధానంలో వ్యాపార అవకాశాలపై చర్చించారని బుచ్చిబాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా పాలసీలో తానేం చేయగలనో చెప్పిన విజయ్‌నాయర్‌.. కవితను ఆకట్టుకొనే యత్నం చేశారని.. పాలసీని అనుకూలంగా రూపొందిస్తే ఆప్‌ పార్టీకి కొంత మొత్తం నిధులు సమకూర్చాలని కవితతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో మద్యం విధానం రూపకల్పనలో విజయ్‌నాయర్‌తో కలిసి అరుణ్‌ పిళ్‌లై పనిచేశారన్నారు.

మార్చి 2021లో పాలసీకి సంబంధించి మంత్రుల బృందం కాపీ గురించి అడగ్గా విజయ్‌నాయర్‌ తనకు, పిళ్‌లైకి పంపారని.. పిళ్‌లై ఆ కాపీని తన రెండో ఫోన్‌లోకి కాపీ చేసుకున్నారని వెల్లడించారు.

ఈ క్రమంలో ఆప్, విజయ్‌నాయర్‌కు పిళ్‌లై ద్వారా కవిత నిధులు సమకూర్చారని వివరించారు. కవిత, ఆప్‌ అగ్రనేతలకు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. సమీర్, పెర్నార్డ్‌ రికార్డ్‌లో కవితకు వాటాలు దక్కాయని.. కవిత సూచనల మేరకు అరుణ్‌ పిళ్లై తన పేరుమీదే పెట్టుబడులు పెట్టారని, వ్యాపారంలో వాటా కూడా నేరుగా కవిత ఖాతాల్లోకి రాలేదని బుచ్చిబాబు పేర్కొన్నారు.

సౌత్‌గ్రూప్‌కు కిక్‌బ్యాక్‌లను క్రెడిట్‌ నోట్స్‌ ద్వారా అభిషేక్, దినేష్‌ అరోరాలకు అమన్‌ధాల్‌ చెల్లించారని.. కొంతభాగాన్ని మాత్రం అభిషేక్‌ బోయినపల్లికి నగదురూపంలో చెల్లించారని బుచ్చిబాబు వివరించారు.’’ అని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. 
 
సౌత్‌గ్రూప్‌ అని ఎందుకు అన్నామంటే..? 
ఈ కేసులో కొందరి బృందాన్ని సౌత్‌ గ్రూపు అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్లో వివరించింది. దర్యాప్తు సమయంలో పలువురు వ్యక్తులు సౌత్‌గ్రూప్‌ అని ప్రస్తావించడం వల్లే.. ఆ గ్రూప్‌లోని ప్రతినిధుల గురించి చార్జిషీట్‌లో సౌలభ్యం నిమిత్తం సౌత్‌ గ్రూపుగా పేర్కొంటున్నామని తెలిపింది.

సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్‌గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్‌లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు బదిలీ చేయడానికి విజయ్‌ నాయర్, దినేశ్‌ అరోరాలతో కలిసి అభిషేక్‌ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది. 
 
హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారు 
ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. మంగళవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అరుణ్‌ పిళ్‌లై బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫీనిక్స్‌ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు.

ఈ కేసులో కవితకు ప్రతినిధిగా అరుణ్‌ పిళ్‌లై వ్యవహరించారన్నారు. దీనిపై తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని పిళ్‌లై తరఫు న్యాయవాది కోరగా.. విచారణ జూన్‌2కు వాయిదా వేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement