సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌రావును లోతుగా విచారిస్తే కేసులో కీలకమైన అంశాలు, రాజకీయ ప్రముఖుల పాత్ర తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ ప్రమేయం కన్పిస్తున్నట్టు సీబీఐ ప్రాథమిక విచారణ ద్వారా తేల్చింది. ఈ క్రమంలో ఆయనకు గల రాజకీయ సంబంధాలు ఈ కేసులో అత్యంత కీలకమని, వీటిపై సమగ్ర సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కోర్టు అనుమతితో అభిషేక్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది.
ఆ బంధమేంటి?: ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో కొందరు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక సమాచార నివేదికలో 16 మంది ప్రమేయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని నిందితుడిగా చేర్చింది. అభిషేక్‌తో పాటు పిళ్ళై కూడా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఈ లింక్‌తో ముందుకెళ్ళిన సీబీఐ అనేక విషయాలను రాబట్టినట్టు తన రిమాండ్ రిపో ర్టులో పేర్కొంది. అభిషేక్ బ్యాంకు ఖాతాలపై సీబీఐ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సహ నిందితుడు సమీర్ మహేంద్రుకు భారీగా ముడుపులు చేరడం, అక్కడ్నుంచి ఇతరులకు పంపిణీ అవ్వడంపై స్పష్టత కోసం అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించే వీలుంది. లిక్కర్ స్కాంలో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లో సమావేశమవ్వడం, ఇందులో అభిషేక్ కూడా పాల్గొనడంతో స్కామ్‌తో అభిషేక్‌కు ఉన్న లింకులేమిటో తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.
అభిషేక్ గుట్టు విప్పేనా?
లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరఫున మహేంద్రు ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. అయితే ఈ కుంభకోణంలో రాజకీయ ప్రము ఖుల హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ.
కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థకు లభించిన డాక్యుమెంటరీ ఆధారాలు, హవాలా మార్గంలో నిధులు చేతులు మారడం, ఎవరు లబ్ధి పొందారు? అనే కోణాల్లో అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment