సాక్షి, మేడ్చల్ జిల్లా: కరోనా కరాళ నత్యం చేస్తున్న వేళ...విద్యా సంస్థలు నిరవధికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలను తెరవకూడదని పేర్కొనటంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. అలాగే, ఫీజులుం కోసం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించగా, పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఐదు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ చర్యలకు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు బడికెళ్లకుండానే ... పాఠాలు నేర్చుకునే విధంగా జిల్లా విద్యా శాఖ ‘మేడ్చల్ బడి’ పేరుతో గత నెల 7న అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌కు విద్యార్థుల నుంచి భారీగా స్పందన లభిస్తున్నది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు బడికి వెళ్లకుండానే తమకు నచ్చిన సమయంలో... తమకు నచ్చిన పాఠ్యాంశాన్ని వీలున్నప్పుడు చూస్తూ...చదువు కొనటానికి అవకాశం ఏర్పడింది. కరోనా కష్ట కాలంలో పాఠశాలలు మూతబడిన దశలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠాలు నేర్పే చదువులమ్మగా ‘మేడ్చల్ బడి’ వెబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతున్నది.
విద్యార్థులకు ప్రయోజనం ఇలా...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ‘మేడ్చల్ బడి’ వెబ్‌సైట్‌ను డీఈఓ విజయకుమారి ప్రత్యేక శ్రద్ధతో రెండు నెలలు శ్రమించి అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధించాలనే ఉద్దేశ్యంతో సంబంధిత ఉపాధ్యాయుల సహకారాలతో మేడ్చల్‌బడి’ని డీఈఓ తయారు చేయించారు. పాఠాలకు సంబంధించిన వీడియోలను రూపొందించి వెబ్‌సైట్‌లో పెట్టిన విద్యాశాఖ ప్రయోజనకరంగా ఉందన్న ఉద్దేశ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు వీలున్నప్పుడల్లా లాగిన్ అయి పాఠాలు వింటున్నారు.
వెబ్‌సైట్‌లో 250 పాఠ్యాంశాలు
మేడ్చల్ బడి వెబ్‌సైట్‌లో 250 పాఠ్యాంశాలు అప్‌లోడ్ చేయటంతో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతి రోజు 3 వేల నుంచి 5 వేల మంది సంబంధిత పాఠ్యాంశాలను వీక్షిస్తున్నారు. ఈ నెల 7 వ తేదీ వరకు 1,11,339 మంది విద్యార్థులు తమకు సంబంధించిన పాఠ్యాంశాలను వీక్షించి పాఠాలు నేర్చుకున్నారు. జులై 11న అత్యధికంగా 13,889 మంది వెబ్‌సైట్ ద్వారా పాఠాలు వినగా, అత్యల్పంగా ఈ నెల 3 వ తేదీన 1414 మంది విద్యార్థులు పాఠాలు విన్నారు. అందులో భాగంగా ప్రత్యేక మార్పులు తీసుకువచ్చి రోజూ ఒక సబ్జెక్టు మేరకు సమయం ఇచ్చి విద్యార్థులు అభ్యసనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అనునిత్యం అసైన్‌మెంట్లు అప్‌లోడ్ చేస్తున్నారు. విద్యార్థులు కూడా తాము చేసిన అసైన్‌మెంట్లు అప్‌లోడ్ చేసే వీలు కల్పించారు.
విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు
మేడ్చల్‌బడి వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులకు మంచి జరుగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల స్పందన ఆధారంగా ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేసి వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. వెబ్‌సైట్‌లో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించి పెట్టాం. అందరికి అందుబాటులో ఉండేలా పాఠాలను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. – డీఈఓ విజయకుమారి
Comments
Please login to add a commentAdd a comment