
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. టీకా డోసులు అందుబాటులో ఉన్నా, అర్హులైన లబ్ధిదారులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడంలేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేదన్న భావనతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా కరోనా టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రోజుకు 5 లక్షల వరకు డోసులు వేయాలని భావించారు.
అవసరమైతే ఏడెనిమిది లక్షలు కూడా వేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్ కూడా పెట్టారు. కానీ, ప్రస్తుతం రోజుకు అటుఇటుగా రెండుమూడు లక్షలకు మించి టీకాలు నమోదు కావడంలేదని అధికారులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు దాదాపు 200 లోపు నమోదవుతున్నాయి. కరోనాతో ఒక్కోరోజు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. కరోనా పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తిగా తగ్గే అవకాశాలు కూడా లేవంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని స్కూళ్లల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. కాబట్టి ఏమరుపాటు తగదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొంటున్నారు.
20 రోజుల్లో 52.76 లక్షల డోస్‌లు వచ్చే అవకాశం...
ఈ నెలలో ఇప్పటివరకు 20.77 లక్షల కరోనా టీకాలు రాగా, నెలాఖరు వరకు మరో 52.76 లక్షల టీకాలు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ అ ంచనా వేసింది. టీకాలు అందుబాటులో ఉ న్నా తీసుకునేవారు ముందుకురాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
►ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా డోసులు తీసుకున్నవారిలో ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. 3.01 కోట్ల మంది ప్రభుత్వం నుంచి కరోనా వ్యాక్సిన్లు పొందగా, 38.77 లక్షల మంది ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందారు.
►దేశంలో అర్హులైనవారిలో మొదటి డోస్ తీసుకున్నవారు 79% ఉండ గా, తెలంగాణలో 84.3 % ఉన్నారు.
►రెండో డోస్ తీసుకున్నవారు దేశవ్యాప్తంగా 37.5 శాతం ఉండగా, తెలంగాణలో 38.5 శాతం ఉన్నారు.
►ప్రధానమైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 8వ స్థానంలో ఉంది.
ఇప్పటివరకు 3.40 కోట్ల డోస్‌లు అందజేత...
రాష్ట్రంలో ఇప్పటివరకు 3.40 కోట్ల డోసుల టీకాలు వేసినట్లు వైద్య,
ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో మొదటి డోసు వేసుకొని రెండో డోసు తీసుకోనివారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా మొదటి డోసు టీకా తీసుకున్నవారు నూటికి నూరు శాతం ఉన్నారు. అత్యంత తక్కువగా వికారాబాద్ జిల్లాలో 66 శాతమే ఉన్నారు.
రాష్ట్రంలో టీకాకు అర్హుల సంఖ్య: 2.77 కోట్లు ఇందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య: 2.33 కోట్లు రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య: 1.06 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment