పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌ | Deputy Chief Minister Bhatti Vikramarka At The Las Vegas Mine Expo | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌

Published Sat, Sep 28 2024 5:15 AM | Last Updated on Sat, Sep 28 2024 5:15 AM

Deputy Chief Minister Bhatti Vikramarka At The Las Vegas Mine Expo

మైన్స్‌ ఎక్స్‌పో–2024 సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, వస్తు సేవల ఉత్పత్తి రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ..అమెరికన్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్‌ సిటీ అయిన హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరుగుతున్న మైన్స్‌ ఎక్స్‌పో– 2024 సదస్సులో గురువారం ఆయన ప్రముఖ అమెరికన్‌ కంపెనీలతో సమావేశమయ్యారు. భారత ఆర్థిక పురోగతిలో అమెరికన్‌ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్‌ సంస్థలు హైదరాబాద్‌ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యా పారాలు నిర్వహిస్తున్నాయని, తద్వారా హైదరాబాద్‌ గ్లోబల్‌ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్‌ హబ్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపా యాలు గల హైదరాబాద్‌ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం అని అన్నారు. హైదరాబాద్‌ టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఉంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోలాజికల్‌–ఈ, భారత్‌ బయోటెక్‌ వంటి కంపెనీల ఆవిష్కరణలతో ‘వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా నగరం ఖ్యాతి గడించిందని చెప్పారు.

ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంతో హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్, గ్రీన్‌ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామని, ఈ విభాగాల్లో ఆసక్తి, అనుభవం ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన, పారిశ్రామిక విధానాలు రూపొందించామని, కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి, పునరుత్పాదక విద్యుత్‌ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.

ఫ్యూచర్‌ సిటీలో నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీని వృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలి పారు. సదస్సులో ఆ్రస్టేలియాకు చెందిన డోపల్‌ మేర్‌ కంపెనీ స్టాల్‌ను సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు, ఓవర్‌ బర్డెన్‌ రవాణా బెల్టులు, వాటి పనితీరును పరిశీలించారు. సౌత్‌ ఆఫ్రికా, స్విజర్లాండ్‌ వంటి దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్‌ నిర్వాహకులు వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్, సింగరేణి సీఎండీ ఎన్‌. బలరామ్, స్పెషల్‌ సెక్రటరీ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement