సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. మూలాలను శోధించే క్రమంలో తాజాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీచేసింది. ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టుతో హైదరాబాద్‌లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
నిగ్గుతేలే నిజాలేంటి?
సీబీఐ విచారణలో అభిషేక్‌రావు చెప్పిన నిజాలేంటి? వరుస సోదాల్లో ఈడీ, సీబీఐ సేకరించిన డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల్లో లభ్య మైన సమాచారమేంటి? రామ చంద్ర పిళ్లై పాత్రను నిక్కచ్చిగా చెప్పే సాక్ష్యాలేంటి? అనేవే ఈ కేసులో కీలకాంశాలు. ఢిల్లీ డిప్యూటీ సీఎంను విచారణకు రప్పించడంతోనే దర్యాప్తు సంస్థ వద్ద కీలక ఆధారాలున్నా యని అర్థమవుతోందని న్యాయనిపుణులు అంటున్నారు.
దీని తర్వాత దృష్టి తెలంగాణ వైపు మళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంలో కొంతమంది రాజకీయ ప్రముఖులకు ఉచ్చు బిగియవచ్చనే ఊహాగానాలు వెలువడుతు న్నాయి. రామచంద్ర పిళ్లైకి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లిక్కర్ సామ్రాజ్యంతో సంబంధాలున్నాయనేది తెలిసిన విషయమే. అతను నిర్వహిస్తున్న రాబిన్ డిస్టిలరీస్ కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌రావు, గండ్ర ప్రేమ్‌సాగర్ రావు డైరెక్టర్లుగా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీల్లో సిండికేట్ అనుకూల మార్పుల తర్వాత రాబిన్ డిస్టిలరీస్ దక్కించుకున్న టెండర్లపైనా సీబీఐ ఆరా తీసింది.
ముడుపుల మెలికే కీలకం
మద్యం పాలసీ రూపొందడానికి ముందు వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాలు, వాటికి హాజరైన వ్యక్తులు, ఈ సమయంలో ఒక ఖాతాలోంచి ఇంకో ఖాతాలోకి డబ్బులు మారిన తీరుపై సీబీఐ ఇంతకాలం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విలువైన ఆధారాలూ సేకరించింది. అయితే, ఈ ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వచ్చాయి? అంతిమంగా ఎవరికి అందాయనే అంశాన్ని తేల్చేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు రాబిన్ డిస్టిలరీస్ కంపెనీ నుంచే ముడుపులు అందాయనేది దర్యాప్తు సంస్థ అభియోగం. ఈ క్రమంలో దాదాపు రూ.3.85 కోట్లు అనేక మార్గాల్లో చేతులు మారాయని సీబీఐ అనుమానం. ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ కంపెనీ యజమాని సమీర్ మహేంద్రు పాత్ర కుంభకోణంలో ప్రధానంగా కన్పిస్తోంది. ఇతని ద్వారా సిసోడియా ప్రధాన అనుచరుడు దినేశ్ అరోరాకు చేరాయా? అక్కడి నుంచి డిప్యూటీ సీఎంకు తరలిపోయాయా?
అనే అంశాలపై సీబీఐ ఆరా తీస్తున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై అరోరాను అరెస్టు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకూ సీబీఐ వెళ్లడంతో ఈ కథ ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశమైంది. ఏదేమైనా 14 మంది నిందితుల్లో ఇప్పటికే ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. మిగిలినవారినీ అరెస్టు చేయడం లాంఛనమేననేది తాజాగా వస్తున్న సంకేతాలు. ఈ కేసులో ఎక్సైజ్ ఉన్నతాధికారులకూ త్వరలో నోటీసులు తప్పవని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment