నిజాంపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న అమిత్ షా. పక్కన శేరిలింగంపల్లి అభ్యర్థి రవికుమార్ యాదవ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బండ్లగూడ, అంబర్‌పేట (హైదరాబాద్): తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కోట్లాది రూపాయలు తెచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని, బీసీని సీఎం చేసి తీరుతామని అన్నారు. తన కుమారుడు కేటీఆర్ కోసమే కేసీఆర్ రాష్ట్రంలో అవినీతి పాలన సాగించారని ఆరోపించారు.
డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్లకే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని, ఇక కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రి పదవి కావాలంటే ఢిల్లీలో చర్చ జరగాలని అన్నారు. ఇలాంటి పారీ్టలు మనకు అవసరం లేదని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల సకల జనుల సంకల్ప సభలో, హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్షాకోట్, నగరంలోని నిజాంపేట, అంబర్‌పేటల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు.
బీఆర్‌ఎస్ అంకం ముగిసిపోయింది..
‘గత ఎన్నికల్లో ఇచి్చన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. 2014 ఎన్నికల తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారు. బీఆర్‌ఎస్ అంకం ముగిసిపోయింది. ఆ పార్టీ పాలనలో ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు, మద్యం, గ్రానైట్ కుంభకోణాలే ఉన్నాయి. అవినీతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనులు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్‌లు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు ప్రజలంతా బీజేపీని గెలిపించాలి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారికి జైలు శిక్షలు విధిస్తాం.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా యువత జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. కేవలం తన కుటుంబానికే పదవులు కలి్పస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు కొమ్ముకాస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు అయిన కారు స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అవినీతిని అంతమొందించి ఆయన్ను ఇంటికి పంపిస్తేనే ఎంఐఎం అగడాలకు అడ్డుకట్ట పడుతుంది..’ అని అమిత్‌షా అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి బీజేపీ కృషి
‘ప్రధాని మోదీ దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా పరిష్కరించని అయోధ్య రామాలయం సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పాటుపడుతోంది. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించి బాధ్యులను జైలుకు పంపుతాం. రెండున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఉన్న గల్ఫ్ కారి్మకుల కోసం ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ పాలసీని తీసుకొస్తాం. బీడీ కారి్మకులకు ఉచిత చికిత్స కోసం నిజామాబాద్‌లో 500 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తాం.
పెట్రోల్, డీజిల్‌పై జీఎస్‌టీని తగ్గిస్తాం. రూ.3,100కు క్వింటాల్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అయోధ్య శ్రీరాముని దర్శనం కలి్పస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మోదీ సంకల్పంతో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నాం. దీంతో పసుపు రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి..’ అని అమిత్‌షా చెప్పారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారీ్టతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, అభ్యర్థులు కృష్ణయాదవ్ (అంబర్‌పేట), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్), ఏలేటి అన్నపూర్ణమ్మ (బాల్కొండ), పైడి రాకేశ్‌రెడ్డి (ఆర్మూర్), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment