సాక్షి, కొండగట్టు(జగిత్యాల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకు కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. అంజన్న దర్శనం కోసం తరలివస్తున్న భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.
20 కెమెరాలు.. రూ.10లక్షల వ్యయం
భక్తుల రక్షణ, అక్రమాలు అరికట్టే ఉద్దేశంతో ఐదేళ్లక్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కెమెరాలకు రూ.8లక్షల – రూ.10లక్షల వరకు వె చ్చించారు. ఆలయంలో 16, వై జంక్షన్ వద్ద రెండు, ఇతర ప్రదేశాల్లో మరోరెండు సీసీ కెమెరాలు బిగించారు. ఆలయంలోని టెంకాయ కొట్టేచోట కెమెరా లేదు. టెండర్‌దారులు భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని వె ళ్తున్న వారిని కొందరు అర్చకులు మరీ పిలిపించుకు ని గోత్రానామాలు చదవడం, స్వామివారి కుంకు మ, పండ్లు ఇవ్వడం ద్వారా రూ.100 – రూ.500వరకు దండుకుంటున్నారు. ఈ తంతు సీసీ కెమెరాల సాక్షిగా సాగుతోంది. అయినా వారిలో భయం, భక్తీలేదు. రూ.వేలల్లో వేతనాలు తీసుకునే అర్చకులు.. ఆలయ హుండీల్లోకి వెళ్లే సొమ్మును సైతం తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని సంస్థకు చెందిన కొందరు.. భక్తుల నిలువుదోపిడీ చూడలేక ఇటీవల ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అర్చకులు, టెంకాయ కొట్టేచోట దోపిడీ ఆగినా.. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేశాక.. ఇప్పుడు మళ్లీ మొదలైంది.
కెమెరాల ముందే దోపిడీ జరుగుతున్నా..
► ఇప్పటికే ఆలయంలోని పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 30 కెమెరాలు ఏర్పాటుచేస్తే అంతటా నిఘా ఉంచినట్లవుతుంది.
► ఇటీవల రూ.10లక్షలు వెచ్చించి మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ప్రోక్యూర్‌మెంట్ పిలిచారు.
► రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సాక్షిగా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడేలేడు.
► ఇప్పటికిప్పుడు రూ.10లక్షలు వెచ్చించి కెమెరాలు ఏర్పాటు చేసినా ఎవరు పర్యవేక్షిస్తారో అధికారులకే తెలియాలి.
► ఇదే సొమ్ముతో ఆలయ అధికారులు నేరుగా కెమెరాలు కోనుగోలు చేస్తే రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని భక్తులు అంటున్నారు.
► రూ.లక్ష వెచ్చించి నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షించినా రూ.6లక్షల్లో ఈప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు రూ.4లక్షలు చేర్చి రూ.పదిలక్షలతో టెండర్ పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నిఘా వ్యవస్థ పనిచేస్తే..
► భక్తుల భద్రతకు ఢోకా ఉండదు.
► కట్నాలు, కానుకల రూపంలో స్వామివారికి సమర్పించే సొమ్మంతా హుండీల్లోకే వెళ్తుంది.
► తద్వారా అంజన్న ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
► దొంగలు, అక్రమాలకు పాల్పడేవారు ఆలయ పరిసరాల్లోకి వస్తే గుర్తుపట్టడం సులభమవుతుంది.
► ఇతరత్రా నేరాలు, అఘాయిత్యాలు అరికట్టే వీలుంటుంది.
► సీసీ ఫుటేజీలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతాయి.
నిఘా ఉన్నా భయం లేదు
కొండపై టెంకాయ కొట్టేచోట కొందరు అర్చకులు భక్తులను దోపిడీ చేస్తున్నారు. మేం ఈవోకు ఫిర్యాదు చేశాం. ఆయన స్పందించి అక్రమార్కులను హెచ్చరించారు. కొద్దిగా దోపిడీ తగ్గింది. ఇప్పుడు మళ్లీ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే అక్రమార్కులపై చర్య తీసుకునే అవకాశం ఉంది.
– కె.అనిల్‌గౌడ్, హిందూ వాహిని ప్రతినిధి, కొడిమ్యాల
రూ.లక్షలు వృథా ఎందుకు?
గతంలో పదిలక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటితో ఎవరూ భయపడతలేరు. ఇప్పుడు మరో పదిలక్షల రూపాయలతో మళ్లీ సీసీ కెమెరాలు పెడితే ఏం లాభం? వాటి నిర్వహణకు ఓ టెక్నీషియన్‌ను నియమించండి. ఆ పనిచేయకుండా సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసినా వృథానే.
– ఎ.వపన్ భక్తుడు, జగిత్యాల
బాధ్యులపై చర్యలు తప్పవు
కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఎవరైనా చర్యలు తప్పవు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ప్రొక్యూర్‌మెంట్ పిలిచాం. ఫ్రైస్ బిడ్ ఫైనల్ కాలేదు. సీసీ కెమెరాల ఏర్పాటు టెండర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు టెండర్ ఫైనల్ చేస్తాం. ఎలాంటి అపోహలకు తావులేదు.
–ఎ.చంద్రశేఖర్, ఈవో
చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం
Comments
Please login to add a commentAdd a comment