ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాల
చాకచక్యంతో తప్పిన ప్రమాదం
మద్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు
చిలకలగూడ: ట్రాఫిక్ రద్దీ ప్రాంతంలో నడిరోడ్డుపైన ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అటు పోలీసులు..ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించాయి. వివరాల్లోకి వెళ్తే..చిలకలగూడ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లోడుతో వెళ్తున్న డీజల్ ట్యాంకర్ వెనుక టైర్ పగిలి.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీజిల్ లీకై రోడ్డుపై ప్రవహించింది.
నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్‌కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు స్పందించి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలు అంటుకోకుండా భారీగా ఫోమ్‌ను స్ప్రే చేయించారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సాయంతో రహదారులపై పడిన డీజిల్‌పై మట్టిపోయించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. సుమారు మూడున్నర గంటలు శ్రమపడి పరిస్థితిని చక్కదిద్దారు.
ట్యాంకర్ వాహనం డ్రైవింగ్ చేస్తున్న మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనుమానం వచి్చన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ చంద్రశేఖర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 105 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్)పాయింట్లు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్‌పై గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఘటన స్థలానికి చేరుకుని తన వంతు సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment