
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ తీరును నిరసిస్తూ పలువురు సీనియర్లు పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలను దిగ్విజయ్‌కు సమర్పించారని, కోవర్టులంటూ జరిగిన ప్రచారం, కమిటీల్లో ప్రాధాన్యంపై ఫిర్యాదు చేశారనే సమాచారం ఓవైపు.. ఇదే సమయంలో రేవంత్ వల్ల రాష్ట్ర పార్టీలో ఊపు వచ్చిందంటూ ఆయనను సమర్థించే నేతలు వివరించారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపాయి.
అసలు దిగ్విజయ్ ఏ సమాచారం సేకరించారు, అధిష్టానానికి ఏం చెబుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గాంధీభవన్‌లో డిగ్గీరాజా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. ఉస్మానియా విద్యార్థి నేతలు చేసిన రచ్చ, దానిపై దిగ్విజయ్ ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం కూడా పలువురు నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. మీడియా సమావేశంలో ఏం చెప్తారోనని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
పది గంటలు.. సుదీర్ఘ భేటీలు
బుధవారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కొందరు నేతలు ఉదయమే హోటల్ వద్ద కలిసి మాట్లాడారు. తర్వాత గాంధీభవన్‌లో సీనియర్లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల వరకు.. అంటే దాదాపు పది గంటల పాటు విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీలో పరిణామాలు, చక్కదిద్దే చర్యలపై అభిప్రాయాలు తీసుకున్నారు.
విద్యార్థి నేతల రచ్చ..
దిగ్విజయ్ పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్న సమయంలోనే ఓయూ విద్యార్థి నేతలు తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గాంధీభవన్ వద్ద నినాదాలు చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరికొందరు నాయకులకు.. విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీనిపై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment