
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్‌ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది.
కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్‌ప్యాడ్‌ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్‌ప్యాడ్‌ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాటన్‌ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్‌రెడ్డిని సంప్రదించగా.. కాటన్‌ప్యాడ్‌ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment