రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్‌ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు.
వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్‌పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment