గాంధీ కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
గాంధీఆస్పత్రి/బౌద్ధనగర్ (హైదరాబాద్): కరోనా నియంత్రణకు త్వరితగతిన ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని సోమవారం సందర్శించిన ఆయన కోవిడ్ వార్డులో బాధితులను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు 58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామన్నారు. తెలంగాణకు 1.68 కోట్ల డోసులు కేంద్రం అందించిందని, మరో 13 లక్షల 18 వేల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
18 ఏళ్ల వయసు లోపు వారికి కోవిడ్ టీకా ట్రయల్‌రన్ సక్సెస్ అయిందని, త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని 19 వ్యాక్సిన్ సెంటర్లలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నిధులు నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యం పథకం కొనసాగించేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాగా, ఇటీవల జరిగిన జన ఆశీర్వాద యాత్రలో కారు డోరు తగిలి నుదుటికి అయిన గాయానికి కేంద్రమంత్రి గాంధీఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం బ్లాక్‌ఫంగస్, కోవిడ్ వార్డులను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీ నర్సింహరావు నేత, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఎంఓ నరేందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బౌద్ధనగర్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment