Diwali Festival 2022: Date Is October 24th Puja Time - Sakshi
Sakshi News home page

Diwali Festival 2022: 24నే దీపావళి పండుగ 

Published Mon, Oct 17 2022 1:19 AM | Last Updated on Wed, Oct 19 2022 5:48 PM

Diwali Festival 2022 Date Is October 24th Puja Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి 24వ తేదీనా.. 25వ తేదీనా..? దివ్వెల పండుగపై నెలకొన్న గందరగోళం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ప్రతిష్టంభనా లేదని, నిస్సందేహంగా 24వ తేదీనే జరుపుకోవాలని పండితులు తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉన్నా, అనవసరంగా కొంతమంది లేవనెత్తిన సంశయం ప్రజల్లో అయోమయానికి కారణమైందని అంటున్నారు.

నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి.  

ఇదీ కారణం..: దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది.

సూర్యాస్తమయానికి అమావా స్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు.

24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి.

గ్రహణంతో సంబంధం లేదు..: ‘అమావాస్య తిథి ప్రదోష వేళ ఉన్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం ఉన్నందున ఆ రోజే పండుగ. అంతేకానీ, మంగళవారం సూర్యగ్రహణం అడ్డుపడినందున పండుగను సోమవారానికి జరిపారు అన్న వాదన అర్థరహితం. పండుగ సోమవారం నిర్వహించాల్సి రావటానికి, సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు’అని ప్రముఖ పండితుడు పంతంగి రమాకాంత శర్మ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement