సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత డీకే అరుణ మంగళవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేగా డీకే అరుణను డిక్లేర్ చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సీఎస్ అసెంబ్లీ కార్యదర్శలకు ఉత్తర్వులు పంపింది.
ఇక 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ, తెరాస నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా.. కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఉటంకించింది.
చదవండి: విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment